అంగన్‌వాడీ టీచర్ పీవో జానకి, ఆవులవారిపాలెం పోలింగ్ బూత్‌లో ఫ్యాన్‌కు ఓటు వేయాలని వృద్ధుడు కోరితే సైకిల్‌కు ఓటు వేసిన వోపీవో వెంకటరమణ
ఓటర్లు చెప్పినవారికి కాకుండా టీడీపీకి ఓట్లు వేసిన పోలింగ్ సిబ్బంది.. రాష్ట్రంలోని పలు బూత్‌లలో సిబ్బంది అత్యుత్సాహం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ టీచర్ సహాయం కోరారు.
తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్‌వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్‌వాడీ టీచర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్‌లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్‌లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు.
వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్‌కు వృద్ధుడు ఫిర్యాదు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్‌లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్‌వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు.
అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్‌కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్‌కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్‌కు వేసిన ఓపీఓ
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్‌లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment