బీజేపీలో నమో స్థైర్యం ! | BJP Namo Resolution! | Sakshi
Sakshi News home page

బీజేపీలో నమో స్థైర్యం !

Published Mon, Nov 18 2013 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

BJP Namo Resolution!

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ అంచనాలకు మించి జయప్రదం కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో జరిగిన భారీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు వ ుూడున్నర లక్షల మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఆరు నెలల కిందట జరిగిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవ డం, ఇటీవల రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలపలేని స్థితి...పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది.

జేడీఎస్‌కు పరోక్ష మద్దతునిచ్చినా ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. వచ్చే ఏడాది మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు మోడీ ఇప్పటి నుంచే దేశమంతటా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరుకు వచ్చారు. ఆయన ప్రసంగానికి కార్యకర్తల నుంచి ఆద్యంతం చక్కటి స్పందన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో మోడీనే తమ తురుపు ముక్క అని పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో కూడా ఆయనతో మరిన్ని సభలు పెట్టించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.
 
మృదువుగా...సూటిగా

దేశ విభజన, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ లాంటి వివాదాస్పద అంశాల జోలికి పోకుండా మోడీ ఈ సభలో జాగ్రత్త పడ్డారు. ఆ విషయాలను ప్రస్తావించవద్దని పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఆయనకు సూచించినట్లు సమాచారం. ఉద్రేకపూరిత ప్రసంగాల్లో దిట్ట అయిన మోడీ ఈ సభలో చాలా సౌమ్యంగా మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం...పదేళ్లలో యూపీఏ సర్కారు వైఫల్యాలపైనే ఆయన దృష్టి సారించారు. పేదలు, మధ్య తరగతి వారిని ఆకర్షించే దిశగా ఆయన ప్రసంగం సాగింది. ‘రూ.15కు మినరల్ వాటర్ కొంటారు.

రూ.20 పెట్టి ఐస్‌క్రీం తింటారు. వీరికి చౌక ధరకు బియ్యం ఇవ్వాలా’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను సుతిమెత్తగా విమర్శించారు. పేదలంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని దెప్పి పొడిచారు. దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా తమ కార్యక్రమాలుంటాయని ప్రకటించారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని దెప్పి పొడిచారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే పెద్ద పీట కనుక, వాటి అభివృద్ధి కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శించారు. మొత్తానికి అభివృద్ధి, 8-10 సంవత్సరాల్లో సాధించాల్సిన వృద్ధి లాంటి అభ్యుదయ భావాలతో కూడిన లక్ష్యాలను ప్రకటించడం ద్వారా మోడీ తాను ‘మారిన మనిషి’ అని చాటుకోవడానికి ప్రయత్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement