![Citizens are not interested in exercising their right to vote - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/30/vote.jpg.webp?itok=52_Gcy2U)
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఉద్యోగం, ఆపై వారాంతపు వినోదాలకు ప్రాధాన్యతనిచ్చే మహా నగరంతో పాటు ఇతర నగరాలు ఓటింగ్‌లో పల్టీ కొడుతున్నాయి. ఎన్నిక ఏదైనా..అభ్యర్థులు ఎవరైనా..మాకేంటి అన్నట్టుగా ఎక్కువ శాతం నగర జనం వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుండగా.. సిటీజనులు ఈసారి ఏ మేరకు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఓటర్లలో 80.4 శాతం మంది ఓట్లు వేయగా, హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం తదితర నగరాల్లో ఓటేసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. తెలంగాణలో ఏకంగా 20కి పైగా నగరాలు, పట్టణాల్లో 53 శాతం లోపు ఓట్లే పోలయ్యాయి. హైదరాబాద్‌లో 50% కూడా మించకపోవడం గమనార్హం.
పల్లెల్లోనే అత్యధిక పోలింగ్
ఎన్నిక ఏదైనా పల్లెల్లోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతోంది. నగరాలు, పట్టణాల్లో ఉండే వారు సైతం పల్లెలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఇందుకు ఒక కారణమవుతోంది. అయితే ఈసారి పల్లెలకు దీటుగా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచారం నిర్వహించాయి. అయితే పోలింగ్ రోజైన గురువారం సెలవు దినం కాగా, మధ్యలో ఒకరోజు (శుక్రవారం) సెలవు పెడితే, శని, ఆదివారాలు సెలవులు (లాంగ్ వీకెండ్) కావడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఓటు వేయటం కనీస బాధ్యత
ఎన్నికల్లో ఓటు వేయటం పౌరుల కనీస బాధ్యత. తమ పని తాము చేయకుండా ప్రశ్నిస్తామనటం ఏ మాత్రం సరికాదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలింగ్ శాతం ఆందోళనకరంగా ఉంటోంది. అందుకే ఈసారి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఓటింగ్ శాతం పెరుగుతుందన్న నమ్మకం ఉంది. - షీలా పనికర్, లెట్స్ ఓట్‌ప్రతినిధి
ఎక్కడకెళ్లినా ఓటేసేందుకు వస్తా
ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి రావటమే నా లక్ష్యం. ఇప్పటివరకు 62 దేశాలు తిరిగా. పోలింగ్ రోజు మాత్రం తప్పకుండాహైదరాబాద్‌లో ఉండేలా చూసుకుంటా. కొండాపూర్‌లో ఓటేసి వెళ్తా. పోలింగ్ డేట్‌ను చూసుకునే నా టూర్ ప్లాన్ చేసుకుంటా. పాండిచ్చేరిలో ఉన్న నేను ఓటు కోసమే హైదరాబాద్ వచ్చా. - నీలిమారెడ్డి, ట్రావెలర్
Comments
Please login to add a commentAdd a comment