కారు జోరా.. హస్తం హవానా.. హంగా?  | Deadline for Telangana Assembly election polling is nearing | Sakshi
Sakshi News home page

కారు జోరా.. హస్తం హవానా.. హంగా? 

Published Sun, Nov 26 2023 4:53 AM | Last Updated on Sun, Nov 26 2023 9:47 AM

Deadline for Telangana Assembly election polling is nearing - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రకరకాల సర్వేలు భిన్నమైన ఫలితాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ అన్నది స్పష్టమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆఖరు నిమిషంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్నప్పటికీ ఇప్పటికైతే మూడో స్థానానికే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌కు ఎదురులేదన్న భావన ఉండేది. కానీ క్రమేపీ కాంగ్రెస్‌ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం నోటి మాట (మౌత్‌ టాక్‌) ప్రకారమైతే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. అలా అని బీఆర్‌ఎస్‌ అవకాశాలు పూర్తిగా పోయాయని కాదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెగటివ్‌ సమస్యను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కొద్దిరోజుల క్రితం మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ అశోక్‌నగర్‌కు వెళ్లి అక్కడ నిరుద్యోగులతో భేటీ అయినప్పుడు వచ్చిన ప్రశ్నలు ఆ విషయాన్ని చెబుతాయి. ఆయన సమర్థంగా వారి ప్రశ్నలకు జవాబిచ్చినా, మౌలికంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం అర్థమవుతుంది.

అంతేగాక సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలిపై కొంత అసంతృప్తి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మరికొంత వ్యతిరేకత ఉంది. పదేళ్లు ఈ పాలన చూశాంగా అన్న భావన కూడా ఉంది. అదే సమయంలో కేసీఆర్‌ వ్యూహాత్మక సుడిగాలి ప్రచారం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌కు సంబంధించి చేసిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు బీఆర్‌ఎస్‌కు ప్లస్‌ పాయింట్‌ అని చెప్పాలి. వీటితోపాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌ కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది ఉండదని, ఎలాగైనా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేసీఆర్‌ తమకు గతంలో వచ్చిన సీట్లకన్నా నాలుగైదు ఎక్కువే వస్తాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అంత సులువుగా లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో లేనంతటి గట్టి పోటీని బీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటోంది. బీఆర్‌ఎస్‌ బొటా»ొటీ మెజార్టీతో అధికారంలోకి రావడమో, లేక ఎంఐఎంకు వచ్చే ఆరేడు సీట్లతో గండం నుంచి బయటపడటమో జరగొచ్చన్నది ఒక అంచనా. ఒకవేళ కాంగ్రెస్‌ ఇంకా పుంజుకుంటే కష్టం కావొచ్చు. ముస్లింలు గతసారి బీఆర్‌ఎస్‌ వైపు పూర్తిగా మొగ్గుచూపారు. ఇప్పుడు వారు ఎలా ఉంటారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.  

హస్తం పార్టీ ఇలా... 
కాంగ్రెస్‌ విషయానికొస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆ పార్టీకి బలంగాను, బలహీనతగాను కనిపిస్తున్నారు. ఆయన చేసే ప్రసంగాలు కేడర్‌లో జోష్‌ నింపుతున్నాయి. ఆయనైతే కచ్చితంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. తమకు అనుకూలంగా వేవ్‌ వస్తుందన్నది ఆయన ఆశ. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పర్యటనలు చేస్తున్నారు. రాహుల్‌ గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు అదనపు ఆకర్షణగా ప్రచారం సాగిస్తున్నారు. అదే సమయంలో రేవంత్‌ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం నచ్చకపోవడం, ఆయనపై ఉన్న ఇతర విమర్శలు బలహీనత కావొచ్చు.

ప్రస్తుతానికైతే ఆయన బలహీనతలు పెద్దగా చర్చనీయాంశమవడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్‌కు 70–80 స్థానాలు వస్తాయని రేవంత్‌ చెబుతున్నా.. అది అంత సులభం కాదు. ఎందుకంటే పైకి కాంగ్రెస్‌ అనుకూల వాతావరణం ఉన్నట్లు కనబడుతున్నా, కొన్ని పరిమితులూ ఉన్నాయని క్షేత్రస్థాయిలో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ అయితే కాంగ్రెస్‌ది పై చేయి కావొచ్చన్నది వారి పరిశీలనలో వెల్లడవుతోందట. కానీ కొన్ని పరిణామాలు దానిని దెబ్బతీయొచ్చు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత బలమైన అభ్యర్థులు ఎక్కువ చోట్ల లేకపోవడం ఒక లోటుగా చెబుతున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది.  
 
30 స్థానాలపై కమలం దృష్టి 
బీజేపీ సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. వాటిలో ఎక్కువ చోట్ల కనుక గణనీయంగా ఓట్లను పొందితే అది కాంగ్రెస్‌కు చేటు చేయొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. సిర్పూరు, పెద్దపల్లి, సూర్యాపేట వంటి కొన్ని చోట్ల బీఎస్పీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీనివల్ల కూడా కొంత కాంగ్రెస్‌కు, మరికొంత బీఆర్‌ఎస్‌కు నష్టం జరగొచ్చు.

ఫార్వర్డ్‌ బ్లాక్‌ పేరుతోకానీ, స్వతంత్ర అభ్యర్ధులుగా గానీ మరో పది, పదిహేను చోట్ల ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తున్నారు. ఉదాహరణకు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పక్షాన నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్‌ తన మిత్రపక్షమైన సీపీఐకి సీటు కేటాయించింది.

కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో సహకరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా కాంగ్రెస్‌లోని కొందరు, అలాగే బీఆర్‌ఎస్‌కు చెందిన మరికొందరు జలగం వైపు మళ్లితే ఇరుపక్షాలకు నష్టం కలగవచ్చు. లేదా ఆయన చీల్చే ఓట్లను బట్టి గెలుపుఓటములు నిర్ణయమవుతాయి. ఈ రకంగా చూస్తే సుమారు 30–40 చోట్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటినీ అధిగమించి కాంగ్రెస్‌ పుంజుకుని ప్రభంజనం సృష్టించుకోవాల్సి ఉంటుంది.  
 
ఎంఐఎం ఆరేడు సీట్లలో గెలిస్తే.. 
119 సీట్లలో ఆరేడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంటుంది. మిగిలిన 112 సీట్లలో ఈ రకంగా 30 నుంచి 40 సీట్లలో తేడా వస్తే మిగిలిన సుమారు 70 నుంచి 80 సీట్లలోనే కాంగ్రెస్‌ తన ప్రభావం చూపగలుగుతుంది. సహజంగానే అన్నిట్లోనూ గెలిచే అవకాశం ఉండదు. ఇదే సమస్య బీఆర్‌ఎస్‌కూ ఎదురుకావొచ్చు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం బీఆర్‌ఎస్‌కు కలిసి రావొచ్చు. ఈ రెండింట్లో ఏ పార్టీ అయితే వేవ్‌ సృష్టించుకోగలుగుతుందో దానికి పూర్తి మెజార్టీ రావొచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. అందువల్ల హంగ్‌ అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి.  
 
కర్ణాటకలో, మునుగోడులో ఓడి.. 
బీజేపీ గురించి పరిశీలిస్తే, ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు ఇదే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని అనుకున్నారు. కర్ణాటకలో, మునుగోడులో ఓటమి, బండి సంజయ్‌ తొలగింపు, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కుమార్తె పట్ల కొంత ఉదారంగా ఉండటం వంటి కారణాలతో ఆ పార్టీపై విశ్వాసం పోయింది. దానికి తగ్గట్లుగానే బీజేపీలో చేరిన పలువురు ప్రముఖులు మళ్లీ కాంగ్రెస్‌ బాట పట్టారు. అయినా బీజేపీ కొన్నిచోట్ల గట్టి పోటీలోనే ఉంది. కానీ అది తాను విజయం సాధించడం కన్నా, రెండు ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదాని గెలుపు లేదా ఓటమికే ఉపకరించవచ్చన్నది ఒక అంచనా.

దానిని దృష్టిలో పెట్టుకుని మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప ప్రదర్శనకు ప్రధాని హాజరై మాదిగలకు వర్గీకరణకు హామీ ఇవ్వడం, మళ్లీ మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనడానికి రానుండటం, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు గట్టిగా తిరుగుతూ కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగించడం జరుగుతోంది. తద్వారా తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, అంత సీన్‌ కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐదు నుంచి పది సీట్లు వస్తే గొప్ప అన్న భావన ఉంది. అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. 
 
ఎవరికైనా వేవ్‌ వస్తేనే భారీ ఆధిక్యత 

మరో విశ్లేషణ ఏమిటంటే తెలంగాణలో వేవ్‌ వస్తే తప్ప ఏ పార్టీకి భారీ ఆధిక్యత రావట్లేదు. 1983 నుంచి పరిశీలిస్తే,  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఎన్నికల్లో తెలంగాణలో 107 స్థానాలకు గాను టీడీపీకి, కాంగ్రెస్‌కు చెరో 43 సీట్లు వచ్చాయి. ఒకరకంగా ఇది హంగ్‌ వంటి పరిస్థితి. 1985లో టీడీపీకి వేవ్‌ రావడంతో తెలంగాణలో టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1989లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా బొటా»ొటిగా ఇక్కడ 58 స్థానాలు వచ్చాయి.

1994లో టీడీపీ వేవ్‌లో మిత్రపక్షాలతో కలిసి 90 సీట్లు సాధించింది. 1999లో టీడీపీ అధికారంలోకి రాగలిగినా, తెలంగాణలో బీజేపీతో కలిపి 58 స్థానాలే సాధించింది. 2004లో కాంగ్రెస్‌కు వేవ్‌ రావడంతో మిత్రపక్షాలతో కలిపి 84 సీట్లు వచ్చాయి. 2009లో 119 స్థానాలకుగాను కాంగ్రెస్‌ పవర్‌లోకి వచ్చినా ఇక్కడ మాత్రం 50 స్థానాలే లభించాయి. టీడీపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 54 సీట్లు వచ్చాయి. అంటే ఎవరికీ ఆధిక్యత రాలేదన్నమాట.

2014లో బీఆర్‌ఎస్‌ కేవలం 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. 2018లో మాత్రం బీఆర్‌ఎస్‌కు వేవ్‌ ఏర్పడి 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి కట్టినా కేవలం 21 స్థానాలే దక్కాయి. దీని ప్రకారం ఏ పార్టీకి ప్రభంజనం లేకపోతే బీఆర్‌ఎస్‌కు బొటా»ొటి మెజార్టీ లేదా హంగ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఏమవుతుందో చూద్దాం!  

-కొమ్మినేని శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement