ఇక్కడ తీరువేరు వార్‌ వేరు | Voters of Khammam district have a different verdict in the assembly elections | Sakshi
Sakshi News home page

ఇక్కడ తీరువేరు వార్‌ వేరు

Published Wed, Oct 18 2023 1:45 AM | Last Updated on Wed, Oct 18 2023 2:07 AM

Voters of Khammam district have a different verdict in the assembly elections - Sakshi

రెండు ఎన్నికల్లోనూ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాలను దక్కించుకోగా,భద్రాచలంలో సీపీఎం గెలుపొందింది. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్‌ ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇక సత్తుపల్లిలో టీడీపీ, కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికలో పాలేరు నుంచి టీఆర్‌ఎస్‌ గెలుపొందింది.

ఇక 2018 ఎన్నికల్లో మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. వైరాలో ఇండిపెండెంట్‌ అభ్యరి్థ, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను గెలిచింది. అయితే 2018 ఎన్నికల తర్వాత పరిణామాలతో పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ 
తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్‌ఎస్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో బలం పెంచుకుంది.  

ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నజర్‌ పెట్టి ఇక్కడ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.  

జలగం హవా 
సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఎక్కువకాలం జలగం కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. 1957లో జలగం కొండల్‌రావు, 1962, 1967,1972లో వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు విజయ బావుటా ఎగురవేశారు. అనంతరం 1978లో వేంసూరు కాస్తా సత్తుపల్లి నియోజకవర్గంగా ఏర్పడడంతో వెంగళరావు గెలుపొందారు. ఆయన కాసు, పీవీ మంత్రివర్గాల్లో పనిచేశారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం లోక్‌సభ నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆయన సోదరుడు కొండల్‌రావు సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు 2004లో కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 

40 ఏళ్ల తర్వాత... 
గత నలభై ఏళ్లుగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే ప్రతీసారి విపక్షంలోనే ఉంటూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తిరగరాశారు. 1978లో కాంగ్రెస్‌ తరఫున కీసర అనంతరెడ్డి గెలుపొందగా.. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వర్టీ ది. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ 2018లో ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా, ఆయనకు మంత్రి పదవి దక్కింది. 

కమ్యూనిస్టుల కోటకు బీటలు 
గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నా క్రమంగా బీటలు వారుతూ వర్టీ ది. గత రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి జిల్లాలో  ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఇతర పార్టీ లతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

సత్తా చాటిన తుమ్మల 
ఇక సత్తుపల్లి రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఒరవడి సృష్టించారు. 1983లో తెలుగుదేశం తరఫున ఆయన రాజ­కీయ అరంగేట్రం చేశారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి,2009లో ఖమ్మం నుంచి గెలిచారు.  2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి పాలయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆÆŠḥఎస్‌ తరఫున గెలిచినా, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఓటమి పాలయ్యారు. తుమ్మల ఎన్‌టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ కేబినెట్‌లో పనిచేశారు.

శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన  రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్‌ఎస్‌ విజయం సాధించి పాలనాపగ్గాలు చేపట్టినా ఇక్కడ మాత్రం ఒకటీ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ బలమైన ఓటు బ్యాంక్‌ కలిగి ఉండగా.. గతంలో సత్తా చాటిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement