సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది.
రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్‌లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.
నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు
►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ
►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ
►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి
►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి
►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి.
►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి
►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం
►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి
►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO
►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO
►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు
►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు
3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి
శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది.
నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి.
సర్వం సిద్ధం!
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది.
పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా
ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment