కేరళ, తమిళనాడు, ఏపీలో బీజేపీ ఖాతా తెరవదు
బీజేపీకి రాబోయే సీట్లపై శశిథరూర్ వ్యాఖ్య
ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: ఈసారి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ జోక్‌గా అభివరి్ణంచారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
కేరళలో బీజేపీ బోణీపై..
‘‘ దేశవ్యాప్తంగా 400 చోట్ల గెలుస్తానని బీజేపీ నిజంగా జోక్ చేస్తోంది. 300 సీట్లు అసాధ్యమనుకోండి. కనీసం 200 నియోజకవర్గాలను గెల్చుకోవడం కూడా ఆ పారీ్టకి పెద్ద సవాలే. దిగువసభలో అధికారపార్టీ మెజారిటీ కోల్పోతుందనేది దాదాపు ఖరారైంది. కేరళలో ఈసారి కూడా బీజేపీ బోణీ కొట్టబోదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. 2019నాటితో పోలిస్తే ఈసారి దక్షిణాదిన కమలం కమిలిపోవడం ఖాయం’’
కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిపై..
‘‘రెండు దశల్లో పోలింగ్ ముగిసిన 190 స్థానాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమికి అద్భుతమైన స్పందన వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు చూపిన ఎమోషన్స్, ఉత్సాహం ఈ సారి ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సానుకూల పవనాలను బాగా నమ్ముతున్నారు. ఈసారి ఊహించిన దానికంటే ఎంతో ముందున్నాం’’
విపక్షాల విక్టరీ స్థానాలపై..
ఈసారి విపక్షాల కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సరదాగా ‘‘ క్రికెట్‌కు వీరాభిమానిని అయినాసరే ఎంత స్కోర్ కొడతారనేది ఊహించలేను. కానీ గెలుపును ఊహిస్తా. బీజేపీ–ఎన్‌డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగొచ్చు. ఇంకొన్ని రాష్ట్రాల్లో మా కూటమి సత్తా చాటొచ్చు. హరియాణాలో గతంలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదు. కానీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఈసారి మాకు అక్కడ 5–7 సీట్లు రావచ్చు. కర్ణాటకలో ఒక్కటే గెలిచాం. ఈసారి 10–17 గెలుస్తామంటున్నారు. కొందరైతే 20 మావే అంటున్నారు’’
తెలంగాణలో బీజేపీ గెలుపుపై..
‘ తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవడం కష్టమే. బీజేపీ, కాంగ్రెస్ వీళ్లలో ఎవరు జనాన్ని ఆకట్టుకున్నారనేది తేలాల్సి ఉంది. ఇంకా 353 స్థానాల్లో పోలింగ్ మిగిలే ఉంది. ఈ లెక్కన ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముందుంది. నాదో ప్రశ్న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఒక యువకుడు 2014లో బీజేపీకి ఓటేశాడు. అదే యువకుడు పదేళ్ల తర్వాత కూడా అదే బీజేపీకి ఎందుకు ఓటేయాలి?
2014లో బీజేపీ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టేందుకు కృషిచేశామని చెప్పింది. అయినా ఎకానమీలో మార్పు తేలేకపోయింది. 2019లో పుల్వామా దాడులు బాలాకోట్ ఘటనతో దేశ జాతీయభద్రత ప్రశ్నార్థకమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం బీజేపీకి చేతకాదు. ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదు. అధిక ధరల వల్ల నచ్చినవి కొనలేకపోయారు. చైనాతో సరిహద్దు విషయంలోనూ బీజేపీ విఫలమైంది. సరిహద్దుల వెంట 65 పెట్రోలింగ్(గస్తీ) పాయింట్లలో 26 పాయింట్లను భారత్ కోల్పోయింది. ఛాతి విరిచి చెప్పుకునేంతగా మోదీ ఏం చేశారు?’’
Comments
Please login to add a commentAdd a comment