అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారు
ప్రధాని నరేంద్ర మోదీకి ధైర్యం ఉంటే ప్రజల సమస్యలపై మాట్లాడాలి
ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ
రాయ్‌బరేలీ: కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సమస్యలు, రైతన్నలు వెతలు, నిరుద్యోగుల దుర్భర బతుకుల గురించి మాట్లాడకుండా, కేవలం అనవసర విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు.
గతంలో జరిగిన పరిణామాలపై వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం సొంత ఊహాలపై ఆధారపడి ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలంటే ఆయనకు గౌరవం లేదని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం శ్రమిస్తూ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీకి నిజంగా ధైర్యం ఉంటే దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగం కష్టాలపై మాట్లాడాలని సవాలు విసిరారు. ప్రియాంక ఇంకా ఏం చెప్పారంటే..
బీజేపీ అంచనాలు తల్లకిందులే..
మీడియాలో గానీ, రాజకీయ ప్రచార వేదికలపై గానీ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. తమ కష్టనష్టాలపై చర్చ జరగాలని, పరిష్కార మార్గాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ధరలు తగ్గించడానికి, రైతులు, కారి్మకుల సంక్షేమానికి, తమ కష్టాలు కడతేర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దేశంలో ‘మార్పు’ గాలులు బలంగా వీస్తున్నాయి. ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీకి సొంతంగా 370 వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చివరకు వారి అంచనాలన్నీ తల్లకిందులవుతాయి.
మోదీ సమాధానం చెప్పగలరా?
దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ఈ సమస్యను పట్టించుకోకుండా, కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే సంస్థలను నిర్మించిందో, ఏయే పథకాలను సొంతంగా ప్రారంభించిందో నరేంద్ర మోదీ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచి్చన పథకాల పేర్లు మార్చడం తప్ప ఆయన చేసిందేముంది?
రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం..
ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటాం. మనకు ఓటు హక్కు రాజ్యాంగమే ఇచి్చంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగమే ఇచి్చంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగమే బలోపేతం చేసింది. రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజల హక్కులు కాలరాస్తామంటే మేము సహించబోము.
ప్రధానమంత్రి కాబట్టి నవ్వలేకపోతున్నాం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, బంగారం, భూములు, గేదెలు దోచుకుంటారని ప్రధానమంత్రి అంటున్నారు. నిజంగా ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే బిగ్గరగా నవ్వుకునేవాళ్లం. ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి దురదృష్టవశాత్తూ నవ్వుకోలేకపోతున్నాం. అబద్ధాలను కూడా నిజాలుగా ప్రజలను నమ్మించడంలో నరేంద్ర మోదీ ఆరితేరిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment