వారి పోరాటం రెండో స్థానం కోసమే | Uttar pradesh assembly election 2022: Opposition parties fighting for second position in UP | Sakshi
Sakshi News home page

వారి పోరాటం రెండో స్థానం కోసమే

Published Mon, Feb 21 2022 5:01 AM | Last Updated on Mon, Feb 21 2022 5:01 AM

Uttar pradesh assembly election 2022: Opposition parties fighting for second position in UP - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీతో సహా విపక్షాలన్నీ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. బీజేపీ తిరిగి బంపర్‌మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. తృణమూల్‌ వంటి పార్టీల మద్దతు, లఖీంపూర్‌ఖేరీ ఉదంతం వంటివి సమాజ్‌వాదీ పార్టీకి ఏ మాత్రమూ లాభించే పరిస్థితి లేదన్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు...

► ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు?
ఈసారి ఎన్నికల్లో మాకెవరూ పోటీ లేరు. సమాజ్‌వాదీ పార్టీతో సహా విపక్షాలన్నీ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 80 శాతం ఓటర్ల మద్దతు బీజేపీకే ఉంది. విపక్షాలన్నీ కలిపి మిగతా 20 శాతం ఓట్ల కోసమే పోరాడుతున్నాయి.

► తమదిప్పుడు సరికొత్త (నయా) సమాజ్‌వాదీ అని ఆ పార్టీ అంటోంది?
వాళ్లు అణుమాత్రమైనా మారలేదు. మాఫియాలకు, నేర చరితులకు, ఉగ్రవాదులకు సాయపడే వారికి టికెట్లివ్వడం నుంచి మొదలుకుని ఏ ఒక్క విషయంలోనూ సమాజ్‌వాదీ అస్సలు మారలేదు. యూపీలో తాజా గాలి వీస్తోంది తప్పితే ఆ పార్టీ మాత్రం ఎప్పట్లాగే ఉంది.

► చట్ట వ్యతిరేక శక్తులు తనకు ఓటేయాల్సిన అవసరం లేదని అఖిలేశ్‌ అంటున్నారు?
నిజానికి ఆయన ఉద్దేశం అందుకు పూర్తిగా వ్యతిరేకం. చట్ట వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఒక్కతాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ హయాంలో నడిచిన గూండారాజ్‌ను మళ్లీ తేవాలన్నది అఖిలేశ్‌ అసలు మాటల అంతరార్థం.

► లఖీంపూర్‌ఖేరీలో రైతుల మరణాన్ని జలియన్‌వాలాబాగ్‌ దురంతంతో అఖిలేశ్‌ పోలుస్తుండటం బీజేపీకి చేటు చేస్తుందా?
ఈ విషయంలో చట్టం చురుగ్గా పని చేస్తోంది. కేసుపై సిట్‌ నిష్పాక్షికంగా విచారణ జరుపుతోంది. దాన్ని సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న అఖిలేశ్‌ ఆశలు నెరవేరవు. రాష్ట్ర రైతులంతా వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న బీజేపీకే మద్దతుగా నిలుస్తారు.

► తృణమూల్‌ తదితర పార్టీలు సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించడం మీకేమీ నష్టం చేయదా?
తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలకు యూపీలో ప్రజల మద్దతే లేదు. వాటి మద్దతుతో సమాజ్‌వాదీకి ఒరిగేదేమీ ఉండదు.

► యోగి ప్రధాని అభ్యర్థి అవుతారేమోనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి?
నేనో సామాన్య బీజేపీ కార్యకర్తను. పార్టీ నాకిచ్చిన ఏ పనినైనా నెరవేర్చడమే నా బాధ్యత. అంతే తప్ప పదవుల కోసం, కుర్చీల కోసం నేనెన్నడూ పాకులాడలేదు.

► మీరు పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది?
అది సంప్రదాయ బీజేపీ స్థానం. పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడి ప్రజలే మరోసారి గెలిపించుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement