వ్యాపారానికి మెరుగైన పరిస్థితులే లక్ష్యం
జీఎస్‌టీ, పన్నుల హేతుబద్ధీకరణ కూడా
* కొత్త ఏడాదిలో వీటిపైనే అత్యధికంగా దృష్టిపెడతాం...
* ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ మెరుగ్గా నిలిచాం
* పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించడం... కొత్త ఏడాది(2016)లో ఇవే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులను వెచ్చిస్తామని హామీనిచ్చారు.
వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సంక్షోభం కారణంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన రీతిలో రాణించిందని.. రానున్న నెలల్లో వృద్ధి రేటు మరింత పుంజుకుంటుందని జైట్లీ పేర్కొన్నారు. ప్రధానంగా వచ్చే ఏడాది నిర్మాణాత్మక సంస్కరణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ‘మూడు అంశాలను ప్రభుత్వం కీలకంగా తీసుకోనుంది.
భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను వెచ్చించనున్నాం. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి(ఇరిగేషన్) రంగంలో కూడా ప్రభుత్వం మరింతగా పెట్టుబడి చేయనుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి నిబంధనలను మరింత సరళీకరించడంతోపాటు ప్రస్తుత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.
భారత్ వెలుగురేఖ...
ప్రపంచ మందగమనంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగురేఖగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ‘7-7.5 శాతం వృద్ధి అవకాశాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పరుగులు తీస్తోంది. అయితే, మేము నిర్దేశించుకున్న 8 శాతం లక్ష్యం కంటే ఇది తక్కువే. వర్షాలు తగినంతగా కురిసుంటే ఇది సాకారమయ్యేదే. మొత్తంమీద 2015 ఏడాది అత్యంత సంతృప్తికరంగా ముగుస్తోంది.
మన ఆర్థిక వ్యవస్థ మూలాలు అంత్యంత పటిష్టంగా ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎకానమీ ఇంకా పూర్థిస్థాయిలో గాడిలో పడలేదన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. నిజంగా పుంజుకోకుంటే పన్ను వసూళ్లు ఎలా మెరుగవుతాయని ఆయన ప్రశ్నించారు. భారత పారిశ్రామిక వర్గాల్లో కూడా కొంత నిరాశావాదం వ్యక్తమవుతోందన్న ప్రశ్నకు.. కొంతమంది అతిగా చిత్రీకరిస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. మరోపక్క, కొన్ని కీలక బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన కుయుక్తులను కట్టిపెట్టకపోతే.. తగిన ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాల్సి వస్తుందని కూడా జైట్లీ స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంది...
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుదలవల్ల లభిస్తున్న ప్రయోజనాన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకుంటున్నామని జైట్లీ చెప్పారు. ముఖ్యంగా హైవేలు, గ్రామీణ రోడ్లు, రైల్వేలలో పెట్టుబడులను గణనీయంగా పెంచుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోర్టుల్లో కూడా ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
‘ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలో ఉంది. ఆర్‌బీఐ వడ్డీరేట్లు(రెపో) ఈ ఏడాది 1.25 దిగొచ్చాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశం. డాలరుతో మారకం విలువ విషయంలో పలు దేశాలతో పోలిస్తే మనం మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాం’ అని జైట్లీ తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరిగిపోవడంపై మాట్లాడుతూ... ఈ సమస్య చాలా పెద్దదే అయినా.. బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చడం సహా తాము ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.