గాంధీలు నమ్మకంతో నాకీ బాధ్యత అప్పగించారు
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి
కిశోరీ లాల్ శర్మ వ్యాఖ్య
అమేథీలో కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందంటూ బీజేపీ వ్యాఖ్యానించడం ఆ పార్టీ దురహంకారానికి ప్రతీక అని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ వ్యాఖ్యానించారు. గురువారం పీటీఐతో ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశాలు, వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
నేను సైతం సతీశ్ శర్మలా
‘‘ 1990 దశకంలో గాంధీల సన్నిహితుడు, కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ ఇదే అమేథీలో ఎంపీగా గెలిచారు. గాంధీల విజయపరంపరను కొనసాగించారు. తర్వాత తప్పుకుని సోనియాగాంధీ పోటీకి మార్గం సుగమం చేశారు. నేను భవిష్యత్తులో అలాగే చేస్తా. ఇక్కడ గెలిచి పార్టీ తరఫున ప్రాతినిథ్య బాధ్యతలు స్వీకరిస్తా. భవిష్యత్తులో గాంధీలు ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఇవే ప్రాతినిథ్య బాధ్యతలను వారికి అప్పగిస్తా. అమేథీ నుంచి పోటీచేయకుండా రాహుల్ పారిపోయారని బీజేపీ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆ పార్టీకి గాంధీల చరిత్ర తెలియదని అర్థమవుతోంది. బ్రిటిషర్ల కాలం నుంచీ నెహ్రూ–గాంధీల కుటుంబం బ్రిటిషర్లను ఎదిరించిందేగానీ ఎక్కడికీ పారి పోలేదు. ఇప్పుడూ అంతే. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్రచేశారు. బీజేపీని తరి మేయడమే ఆయన ధ్యేయం’’ అని అన్నారు.
ఫ్యూన్, క్లర్క్ వ్యాఖ్యలపై..
‘‘గాంధీల కుటుంబానికి ఫ్యూన్, ప్రియాంక గాంధీకి క్లర్క్ అంటూ నాపై బీజేపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వింటూనే ఉన్నా. బీజేపీ నాయకులకు వారి కుటుంబం నేర్పిన విలువలే అబ్బుతాయి. మా నాన్న నిరక్షరాస్యుడు. అయినా నాకు చక్కటి విద్యాబుద్దులు, నడవడిక, విలువలు నేర్పించారు. కుటుంబం ఏం నేర్పిస్తే అవే ఆ కుటుంబసభ్యులకు వస్తాయి. నాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నా స్పందన, సమాధానం పొందే స్థాయి, అర్హత వారికి లేవు’’ అని వ్యాఖ్యానించారు.
నమ్మకాన్ని నిలబెడతా..
‘ నాపై నమ్మకంతో అమేథీ బాధ్యతలను గాంధీలు నాకు అప్పగించారు. అమేథీపై గాంధీల చెరగని ముద్ర ఉంది. ఆ ముద్ర చెరిగిపోకుండా, శాశ్వతంగా ఉండేందుకు ఇకమీదటా కృషిచేస్తా. 41 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం బాధ్యతల్ని చూసుకుంటున్నా. గెలిచి గాంధీల నమ్మకాన్ని నిలబెడతా’’ అని అన్నారు.
కొన్ని పొరపాట్లతో ఓడారు
‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ప్రభుత్వాలు అమేథీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. ప్రభుత్వ అధికారులు, పాలనాయంత్రాంగాన్ని ఈ నియోజకవర్గంలో దుర్వినియోగం చేశాయి. కాంగ్రెస్ సైతం కొన్ని పొరపాట్లు చేసింది. అందుకే గత ఎన్నికల్లో రాహుల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో ప్రజలు రాహుల్‌ను ఓడించలేదు. ఓడించాలనుకుంటే 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించాలి. కానీ రాహుల్‌కు నాలుగు లక్షలకుపైగా ఓట్లు పడ్డాయి. గెలుపునకు కొంత దూరంలో ఆగిపోయారు. ఆయన ఓడిపోయారని అమేథీ ప్రజలపై నేను నిందారోపణలు మోపట్లేను’’ అని అన్నారు.
స్మృతి హామీలు తీర్చారా?
‘‘ ఐదేళ్ల క్రితం స్మృతి ఇరానీ అమేథీ ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? నిరుద్యోగం, ధరలు, వీధి ఆవుల మాటేంటి? సమస్యలు అలాగే ఉన్నాయి కదా? ఎవరు గెలుస్తారని చెప్పట్లేను. ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను గెలిస్తే ఈ విజయం నిస్సందేహంగా గాంధీలదే’’ అని అన్నారు.
– అమేథీ
Comments
Please login to add a commentAdd a comment