
కేంద్ర మంత్రికీ తప్పని నోట్ల కష్టాలు
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు కేంద్ర మంత్రి సదానంద గౌడకు స్వయంగా తెలిసొచ్చాయి. ఆయన సోదరుడు డీవీ భాస్కర గౌడ కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో మంగళూరు కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆస్పత్రి బిల్లులకు పాత నోట్లు ఇవ్వడంతో సిబ్బంది తిరస్కరించారు.
పాతనోట్లు తీసుకోవడానికి గడువు ఉన్నా ఎందుకు తిరస్కరిస్తున్నారని సదానంద గౌడ ఆస్పత్రి వర్గాలపై మండిపడ్డారు. చెక్కు తీసుకోవడానికి కూడా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో పాత నోట్లు స్వీకరించడం లేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ సదానంద చెప్పడంతో సిబ్బంది దిగొచ్చి చెక్కు తీసుకున్నారు. నవంబర్ 24 వరకు పాత పెద్ద నోట్లు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆస్పత్రులు పెడచెవిన పెట్టడం సమంజసం కాదని సదానంద గౌడ అన్నారు.