కొత్త కరెన్సీ నోట్లపై మరో ఆసక్తికర విషయం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాత నోట్ల రద్దుతో వినియోగంలోకి వచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ ఆమోదం ఎప్పుడు చెందిందో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన నోట్ల రద్దుకు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ 7వ తేదీన కొత్త రూ.2000, రూ.500 నోట్ల డిజైన్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆర్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ టీవీ ఛానల్ వేసిన పిటిషన్కు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.
నోట్ల రద్దుతో దేశంలో తీవ్రంగా నగదు కొరత ఏర్పడి, ప్రజలు నానా కష్టాలు పడ్డారు. వాస్తవానికి కొత్త నోట్ల డిజైన్‌కు గత ఏడాది మే 19న ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఆ తర్వాతే ఆ కొత్త నోట్లకు కేంద్రం కూడా తన ఆమోదాన్ని ప్రకటించిందని తెలిపింది. అయితే కొత్త 2వేలు, 500 నోట్లను ముద్రించేందుకు ఎంత కాలం పడుతుందని వేసిన ప్రశ్నకు మాత్రం ఆర్బీఐ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. సమాచారం వెల్లడించడం వల్ల దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని తన రిపోర్ట్‌లో పేర్కొంది. నోట్ల రద్దుపై జర్నలిస్టులు, కార్యకర్తలు వేసిన మరో ఆర్టీఐ ప్రశ్నకు కూడా సెంట్రల్ బ్యాంకు స్పందించింది. పెద్ద నోట్లను రద్దు చేయాలని నవంబర్ 8వ తేదీన కేంద్రానికి సూచన చేశామని, ఆ రోజు రాత్రే ప్రధాని మోదీ టెలివిజన్ స్పీచ్ ద్వారా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని చెప్పింది.