
‘జైట్లీకి ఆ విషయం తెలుసో లేదో చెప్పలేం’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ముందుగా సంప్రదించారా లేదా అనే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద చెప్పేందుకు ఆర్థికశాఖ నిరాకరించింది. అలాంటి విషయాలు తాము చెప్పలేమని నిరాకరించింది. 2016, నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక ప్రధాని మోదీనే ప్రధానంగా ఉన్నారా, మిగితా పెద్ద నేతలను, వారి శాఖలను సంప్రదించారా అనే విషయంలో ఇప్పటికీ పలు అనుమానాలున్నాయి.
గతంలో పీఎంవో, రిజర్వ్‌బ్యాంకును ఇదే అంశంపై ప్రశ్నించినా ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపాయి. తాజాగా అరుణ్ జైట్లీకి ఈ విషయం తెలుసా అని పీటీఐ ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆర్థికశాఖ ఈ విషయాన్ని చెప్పేందుకు నిరాకరించింది. ఆర్థికమంత్రి, ఆర్థికశాఖ ముఖ్య సలహాదారు ద్వారా తెలుసుకోవాలనుకునే ఈ అంశం ఓ సెక్షన్ ప్రకారం ఆర్టీఐ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చింది. భారతదేశ సమగ్రత, భద్రత, వ్యూహాత్మక అంశాలు, శాస్త్ర, ఆర్థికపరమైన అంశాలు, విదేశాంగ విధానాల్లో కొన్నింటిని ఆర్టీఐ ద్వారా తెలియజేయలేమని, అలా చేస్తే నేరాలు జరిగే అవకాశం ఉంటుందని బదులిచ్చింది. అయితే, ఏ సెక్షన్ ప్రకారం చెప్పకూడదో అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.