న్యాయ నియామక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని పలువురు ఆర్థిక, న్యాయ, రాజకీయ ప్రముఖుల అభిప్రాయపడ్డారు
న్యూఢిల్లీ: న్యాయ నియామక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని పలువురు ఆర్థిక, న్యాయ, రాజకీయ ప్రముఖుల అభిప్రాయపడ్డారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) ఏర్పాటును ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన చర్చాగోష్టి ఆసక్తికరంగా సాగింది. ఎన్‌జేఏసీ, కొలీజియం వ్యవస్థపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా విమర్శించారు. జడ్జీలను జడ్జీలే నియమించుకునే ప్రక్రియ.. జింఖానా క్లబ్‌లో ఒక సభ్యుడు, మరో సభ్యుడిని నియమించినట్లుందన్నారు.
అయితే ఎన్‌జేఏసీపై కోర్టు తీర్పును సమర్థిస్తూనే, ప్రస్తుత కొలీజియం వ్యవస్థలోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా, న్యాయ నిపుణులు సోలీ సొరాబ్జీ, రాజీవ్ ధావన్ అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని.. దీన్ని సంస్కరించి.. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను వెబ్ పోర్టల్‌లో ఉంచటం, ఆర్టీఐ కిందకు చేర్చితే పరిస్థితిలో మార్పు రావొచ్చని లోధా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీని కొట్టివేయటం.. పార్లమెంట్ సార్వభౌమాధికారాన్ని కించపరిచినట్లేమీ కాదని ధావన్ అన్నారు. కొత్త చట్టాన్ని కోర్టు కొట్టివేయకుండా.. న్యాయ నిపుణుల సలహా కోసం అడిగి ఉంటే బాగుండేదని సొలీ సొరాబ్జీ తెలిపారు.