కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు | Supreme Court Dismisses Plea Seeking To Bring Collegium Under RTI | Sakshi
Sakshi News home page

కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు

Published Sat, Dec 10 2022 7:18 AM | Last Updated on Sat, Dec 10 2022 7:18 AM

Supreme Court Dismisses Plea Seeking To Bring Collegium Under RTI - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్‌ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్‌ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది.  

తీర్మానాలే ఫైనల్‌ కాదు
2018 డిసెంబర్‌ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్‌ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది.

కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్‌మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్‌ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్‌ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్‌ చేయలేదని పేర్కొంది. 

అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్‌ రిజిజు  
కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది.

ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement