
రూ. 70 వేల కోట్ల బ్లాక్‌మనీ బయటపడింది
కటక్: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలో 70 వేల కోట్ల రూపాయల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్ వెల్లడించారు. ఏప్రిల్ మొదటివారంలో సుప్రీం కోర్టుకు ఆరో మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్ట ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చారు.
కటక్‌లో ఆర్థిక శాఖకు సంబంధించిన పలు ప్రభుత్వ సంస్థల అధికారులతో జస్టిస్ పసాయత్ సమావేశమయ్యారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి గత రెండేళ్లుగా సిట్ మధ్యంతర నివేదికల ద్వారా పలు ప్రతిపాదనలు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఈ ప్రతిపాదనలను ఆమోదించిందని, కొన్ని పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. లెక్కల్లో చూపకుండా 15 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. సిట్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆధ్యాత్మిక వేత్తలు, మాఫియా డాన్‌ల ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఒడిశా క్రైం బ్రాంచ్ అధికారులను ఆదేశించారు.