
రాత్రి 7.30 గంటలకు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31 శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ప్రధాని ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. కాగా పెద్దనోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతోపాటు నష్టాలను కూడా వివరిస్తారని సమాచారం.
నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం 2వేలు, 500 నోట్లను చలామణిలోకి తెచ్చింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు, నిరుపేదలు నానా కష్టాలు పడ్డారు. నోట్ల మార్పిడి గడువు కూడా శుక్రవారంతో ముగిసిపోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని మోదీ చెప్తున్న విషయం తెలిసిందే.