న్యూఢిల్లీ : తమ డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి ఉండటం అత్యంత బాధ కలిగించే అంశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం కొంతమంది వద్దే కార్లు, బంగ్లాలు, లక్షలు ఉండటాన్ని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో 24 లక్షల మంది రూ.10లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు ఇవేనని, దీన్ని ఎవరైనా నమ్ముతారా అని అన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిజాయితీపరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ప్రజల హక్కులను రక్షించాలన్నారు. అలాగే నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చట్టాలను ప్రజలు గౌరవించడం, ప్రభుత్వానికి సహకరించడం ఏ దేశానికైనా శుభసూచకమని ప్రధాని పేర్కొన్నారు. అప్పుడే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చక్కటి కార్యక్రమాలు చేయగలవన్నారు.
బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ ప్రశంస
బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అయితే నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయన్నారు. నల్ల నోట్ల రద్దును అవకాశంగా తీసుకున్న కొంతమంది అధికారులను క్షమించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇక కొందరు ప్రభుత్వ అధికారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం బ్యాంకులు చక్కటి పథకాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పేదలు, రైతులు, దళితులు, మహిళల సాధికారితకు కట్టుబడి ఉండాలన్నారు.
నూతన సంవత్సర వరాలు
దేశ ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలామంది పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు లేవన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద రెండు పథకాలు ప్రకటించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తామని, రూ.9 లక్షల వరకూ రుణాలపై 4శాతం వడ్డీ రేటు తగ్గింపు, రూ.12 లక్షల వరకూ ఇంటి రుణంపై 3 శాతం వడ్డీ తగ్గిస్తామని చెప్పారు.
ఈ పథకం 2017 నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. అలాగే రూ.2లక్షల వరకు ఇంటి రుణంపై 2 శాతం రిబేట్, 3కోట్ల రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులు రుపే కార్డులుగా మార్పు, వచ్చే మూడు నెలల్లోగా కిసాన్ కార్డులుగా మారుస్తామన్నారు. ఎంపిక చేసిన పంట రుణాలపై 60 రోజుల వరకూ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోటి రూపాయల నుంచి రూ.2కోట్లకు పెంచుతున్నట్లు ప్రధాని తెలిపారు.
గర్భవతులకు బ్యాంకు అకౌంట్‌లోనే డబ్బు
గర్భవతులకు ఆరువేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రధాని శుభవార్త తెలిపారు. ఆ నగదును గర్భవతుల బ్యాంకు అకౌంటులోనే జమ చేయనున్నట్లు చెప్పారు. 650 జిల్లాల్లో గర్భవతులకు సరైన ఆహారం, టీకాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల కోసం మరో పథకాన్ని తెస్తున్నామని, సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లు పదేళ్లపాటు ఉంచితే 8శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలంతా భీమ్ యాప్‌ను వినియోగించాలని ప్రధాని కోరారు. అలాగే రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించాలని, పార్టీ నిధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలని, పార్టీలకు వచ్చే నిధుల్లో నల్లధనం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.