‘ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్’
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుతో అందరికీ మేలు జరుగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని అన్నారు. నోట్ల కష్టాలు స్వల్పకాలమే ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ షాక్ దేశానికి మంచి చేస్తుందని, ఆర్థిక మందగమనం కొంత కాలమే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఆధార్ కార్డుతో ఎవరైనా జీరో బాలెన్స్ లేదా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవొచ్చని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో 3 నుంచి 6 నెలల్లో డిజిటల్ నగదు లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులను కొనసాగిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నిలేకని ధన్యవాదాలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ఆధార్ కు సంధానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.