న్యూఢిల్లీ: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రత్యర్థి పార్టీ బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్, ప్రధాన ప్రత్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆదివారం పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు.
మహాభారతాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికార దాహంతో ఉన్న కౌరవులుగా, కాంగ్రెస్ పార్టీ వారు సత్యం కోసం ధర్మపోరాటం చేస్తున్న పాండవులుగా అభివర్ణించారు. బీజేపీ ఆరెస్సెస్ గొంతుక అయితే.. తమది ప్రజావాణి అని చురకలంటించారు. ఎన్డీయే ప్రభుత్వ పలు నిర్ణయాలనూ రాహుల్ తప్పుబట్టారు. దాదాపు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ.. తీర్మానాన్ని ఆమోదించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
మోదీ.. నిలువెల్లా అవినీతి!
‘ప్రధాని వాస్తవ సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తూ.. సన్నిహితులైన పెట్టుబడిదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ మోదీ పేరుతోనే ఇద్దరు (నీరవ్, లలిత్) తీవ్రమైన అవినీతి కేసుల్లో దోషులుగా ఉన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేశారు. కాంగ్రెస్ 126 రాఫెల్ యుద్ధ విమానాలకోసం చర్చలు జరిపితే.. బీజేపీ అదే మొత్తంతో కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మేం ఒక్కో విమానానికి రూ. 570 కోట్లు పెడితే.. మోదీ అదే విమానానికి రూ.1670 కోట్లు పెడుతున్నారు. మోదీ అవినీతిపై పోరాడటం లేదు. అవినీతికి పాల్పడుతున్నారు’
కురుక్షేత్రను తలపించేలా..: ‘శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగా కాంగ్రెస్ పార్టీది సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం’
‘సుప్రీం’ తిరుగుబాటుపై..: ‘బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య చాలా తేడా ఉంది’
ఆ మోదీ, ఈ మోదీ కలిసి..: ‘నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు’
రైతులు, మైనార్టీలు, గౌరీ లంకేశ్‌పై..: ‘గౌరీలంకేశ్, కల్బుర్గీలు ప్రశ్నించినందుకే చనిపోవాల్సి వచ్చింది. ఒకవైపు రైతులు సరైన గిట్టుబాటులేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పదండి యోగా చేద్దామని మోదీ పిలుపునివ్వటం సిగ్గుచేటు కాదా? పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడక ఇక్కడే ఉండిపోయిన వారిని వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. తమిళులను వారి భాషను మార్చుకోవాలని బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారం తమకు నచ్చదంటున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తున్నారు’
యువత గురించి: ‘భారత్‌లోని ప్రతి యువతకూ మేం ఓ ఆయుధం. కాంగ్రెస్ పార్టీ మీది. మీ మేధస్సు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మేం ద్వారాలు తెరుస్తాం. దేశానికి మీ (యువత) అవసరం చాలా ఉంది. ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అచ్ఛేదిన్, మీ అకౌంట్లలోకి రూ.15లక్షలు ఇవన్నీ బూటకమే’
యూపీఏ పాలనపై..: ‘ యూపీఏ–2 చివరి రోజుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం కూడా మనుషులమే. పొరపాట్లు చేస్తాం. బీజేపీతో పోలిస్తే మేం విభిన్నం. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకే ఉంది. మోదీ తను దేవుని ప్రతిరూపం అని భావిస్తున్నారు’
కాంగ్రెస్ పునరుత్తేజంపై..: ‘మనం కాంగ్రెస్‌లో మార్పు తీసుకురావాలి. నాయకులు, కార్యకర్తల మధ్యనున్న అడ్డుగోడలను తొలగిస్తాను. ఇందుకోసం సీనియర్ల సలహాలతో ముందుకెళ్దాం. మన మధ్యనున్న విభేదాలు, గ్రూపు తగాదాలను పక్కనపెడదాం. 2019లో కాంగ్రెస్ ఆలోచనవిధానానిదే విజయం. అవసరమైతే రైతు రుణమాఫీ చేస్తాం’
నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం
మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, అసమర్థ ఆర్థిక నిర్వాహకుల చేతి నుంచి దేశాన్ని కాపాడినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే మార్గమని ఇందులో పేర్కొన్నారు.
ఆర్థికం.. సర్వనాశనం: మన్మోహన్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్లీనరీలో తీవ్రంగా విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ.. భ్రమలు కల్పించి మోసం చేసిందన్నారు. ‘ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేకపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది.
నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి మందగించింది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఆరేళ్లలో రైతు రాబడి రెండింతలు కావాలంటే ఏడాదికి వృద్ధి రేటు కనీసం 12 శాతం ఉండాలి. ఇది ప్రస్తుతం అసాధ్యం’ అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యకు మోదీ ప్రభుత్వం అతితక్కువ ప్రాధాన్యం ఇస్తోందనీ, దాంతో ఈ అంశం ఎన్నడూ లేనంత జటిలంగా తయారైందని మండిపడ్డారు. సరిహద్దులు సురక్షితంగా లేవనీ, సీమాంతర, అంతర్గత ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులపై ప్రతిపౌరుడూ ఆందోళన చెందుతున్నాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment