Gowri Lankesh
-
ప్రకాష్ రాజ్ నిశ్శబ్ద ఉద్యమం
ప్రకాష్ రాజ్... ప్రముఖ సినీ నటుడు... బహుభాషా ప్రేక్షకులకు ప్రియమైన విలన్. నిజ జీవితంలో మాత్రం అణగారిన వర్గాల ప్రియతమ హీరో. బెంగళూరులో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ స్నేహితుడిగా ఆమె చైతన్యాన్ని అందిపుచ్చుకున్నానని ప్రకటించుకొన్నాడు. అభ్యుదయ వేదికల్లో ఆమె ఆదర్శాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పిన ప్రకాష్ రాజ్ అంతే దృఢంగా ప్రజాస్వామ్య కాంక్షాపరుడినని స్పష్టం చేశారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలనూ, అరాచకాలనూ బహిరంగంగా సవాల్ చేశారు. ఆ తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తన ఎజెండా అని ప్రకటించారు. కన్నడ నాట బీజేపీయేతర పార్టీలను గెలిపించండని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే కర్ణాటక ఎన్నికల తరువాత ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమయ్యారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించిందీ లేదు. ప్రకాష్‌రాజ్ ఎక్కడికెళ్లినట్టు? అని ఆరాతీస్తే అభ్యు దయ భావాలుగల ప్రకాష్‌రాజ్ పల్లెసీమల్లో పచ్చటి పంట పొలాల్లో, పూరి గుడిసెల్లో, కప్పులేని పాఠశాలల్లో... చిన్నారుల ఆటస్థలాల్లో... పసివారి నల్లని పలకలపై తెలతెల్లని అక్షరాల్లో... మొత్తంగా కన్నడ రాష్ట్రంలోని నిరుపేద గుండెల్లో మెలమెల్లగా మెరిసిపోతున్నాడు. అందుకే ఇప్పుడు కర్ణాటక గ్రామసీమల్లో ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజాచైతన్యం కోసం... ఎక్కడో పల్లెజనాలను వెతుక్కుంటూ వెళ్లి వారిని చైతన్యం చేసే పనిలో తలమునకలై ఉన్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో మొన్నమొన్నటి వరకూ కేవలం సవాళ్లకే పరిమితమైన ప్రకాష్‌రాజ్ ప్రస్తుతం ఒకడుగు ముందుకేసి కార్యాచరణకు సైతం పూనుకుంటూ ప్రజల్లో విద్య పట్ల, ఆరోగ్యం çపట్ల అవగాహన రేకెత్తిస్తున్నారు. సంక్షేమం ఎవరో వేసిన భిక్ష కాదని, అది ప్రజల డబ్బని.. ప్రజల హక్కనీ వారికి తెలియజెపుతున్నాడు. అలాగే పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వాలు నెలకొల్పినా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనంటూ సామాజిక బాధ్యతను ప్రజలు గుర్తెరిగేలా చేస్తున్నారు. తను పాఠశాలలను దత్తత తీసుకుంటున్నానని వస్తున్న వార్తల పట్ల ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ‘‘దత్తత తీసుకోవడానికి నేనెవరిని? పాఠశాల అందరి సొత్తు. ముఖ్యంగా ప్రజల సొత్తు. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్లేనని’’ తేల్చి చెప్పి వారిని మెప్పించి ఒప్పించారు. భిక్ష కాదు..మన హక్కు మన దగ్గర డబ్బులు లేక పోవచ్చు. కానీ మన పిల్లల చదువులే వారికి మనమిచ్చే సంపద. మీ స్కూలు మీ హక్కు. నిజమైన విద్య ప్రైవేటు పాఠశాలల్లో లేదు. అది ఒక బిజినెస్ మాత్రమే. పేదలకో శిక్షణ, పెద్దల బిడ్డలకో శిక్షణ కాదు. దళితుడికోరకమైన చదువు, ఇతరులకో చదువు కాదు. అందరికీ సమానమైన విద్య ప్రజల హక్కు. అది ప్రభుత్వ బాధ్యత. ఏది బిజినెస్ అవుతుందో అది ప్రజల సొంతం కాదు. ప్రతి పౌరుడికీ సమాన విద్యావకాశాలు, ఆరోగ్యం అనేది ప్రభుత్వం నెరవేర్చాల్సిన కనీస బాధ్యతలు. మన భవిష్యత్తుకోసం పౌరులంతా చేతులు కలపాలంటూ ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ నిశ్శబ్దంగా ఉద్యమిస్తున్నారు ప్రకాష్‌రాజ్. దేవాలయ ప్రాంగణాలను శుభ్రం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కుట్టుమిషన్లు ఉచితంగా పంచడం, ఆటల పట్ల ఆసక్తి పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్లను ఏర్పాటు చేయడంతోపాటు లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఆన్‌లైన్‌లోనూ వైద్యసేవలందించేవారిని పరిచయం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. -
ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు గౌరీ లంకేష్ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) వెల్లడించింది. ఈ మేరకు కన్నడ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇలాంటి కథనాలను చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని ఆయన పేర్కొన్నారు. కాగా, గౌరీ లంకేష్ హత్య కేసులో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గతంలో ఆరోపణలు చేశారు. గౌరీ లంకేష్ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు. Bengaluru: Gauri killers planned to eliminate actor Prakash Rai, reveals SIT probe https://t.co/a3AEfE5vZK ....Look at the narrative to silence voices.. my VOICE will grow more STRONGER now .. you cowards ...do you think you will get away with such HATE POLITICS #justasking pic.twitter.com/tIZd5xoOvq — Prakash Raj (@prakashraaj) June 27, 2018 -
ఆ హిట్ లిస్ట్‌లో మరికొందరి పేర్లు..
సాక్షి, బెంగళూర్ : జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలో పాల్గొన్న గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో మరికొందరి పేర్లు ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనుమానిస్తోంది. గౌరీ లంకేష్ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మరొకరిని సిట్ బృందం శుక్రవారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందుత్వ వ్యతిరేక వైఖరితో వ్యవహరించే మరికొందరి పేర్లను కూడా ఈ బృందం కీలక టార్గెట్స్‌గా హిట్ లిస్ట్‌లో పొందుపరిచిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. సిట్ అదుపులోకి తీసుకున్న సుజిత్ కుమార్ అలియాస్ ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా హిందుత్వ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న ప్రముఖ కన్నడ రచయిత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్, నటుడు గిరీష్ కర్నాడ్, మాజీ మంత్రి బీటీ లలితా నాయక్, హేతువాది సీఎస్ ద్వారకానాథ్, నిదుమామిడి మఠం గురువు వీరభద్ర చన్నమల స్వామి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు గుర్తించారు. కాగా గౌరీలంకేష్‌ను కాల్చిచంపిన కేసులో షూటర్ పరశురామ్ వాగ్మరేను సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిపిన తుపాకినే గతంలో హేతువాది గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గిలను హత్యచేసేందుకు వాడినట్టు సిట్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. -
గౌరీ లంకేష్ హత్య జరిగిన రోజే..
సాక్షి, బెంగళూర్ : జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను కాల్చిచంపినట్టు అనుమానిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. గౌరీ లంకేష్ హత్య జరిగిన రోజే రాడికల్ రైట్ వింగ్ గ్రూప్‌నకు చెందిన కోవర్టు బృందం అధిపతి ఒకరు తనకు 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీని ఇచ్చాడని విచారణాధికారులకు నిందితుడు తెలిపాడు. సెప్టెంబర్ 5, 2017న గౌరీ లంకేష్‌ను కాల్చిచంపిన కేసులో అరెస్ట్ అయిన పరుశురామ్ అలియాస్ వగ్మారె, పరశు అలియాస్ కోహ్లీ కర్ణాటక సిట్ అధికారులకు ఈ మేరకు వెల్లడించాడు. హత్య జరిగిన రోజే తనకు ఆయుధాన్ని సమకూర్చారని, అంతకుముందు రోజు హత్యకు ప్రణాళిక రూపొందించగా ఆమె అనుకున్న సమయం కంటే ముందుగానే ఇంటికి చేరుకోవడంతో మరుసటి రోజు ఆపరేషన్ చేపట్టామని తెలిపినట్టు సిట్ వర్గాలు పేర్కొన్నాయి. గౌరీ లంకేష్ హత్యకు సహ కుట్రదారుగా వ్యవహరించాలని విజయపుర జిల్లా సింధగికి చెందిన 26 ఏళ్ల వగ్మారెను రంగంలోకి దింపారని హత్య జరిగిన రోజే అతడికి గన్ ఇచ్చారని సిట్ వగ్మారె రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది. కాగా గౌరీ లంకేష్ హత్య జరిగిన వెంటనే గన్‌తో పాటు మిగిలిన బుల్లెట్లను ప్రధాన కుట్రదారులకు అప్పగించానని వగ్మారె విచారణ సందర్భంగా పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. వగ్మరే అరెస్ట్ అనంతరం అనుమానిత షూటర్‌కు శ్రీరామ సేనతో సంబంధాలున్నాయని, హత్యకు వాడిన ఆయుధం సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5న హిందూ జనజాగృతి సమితి మాజీ కన్వీనర్ అమోల్ కాల్వే షూటర్‌కు అందించినట్టు సిట్ విచారణ నిగ్గుతేల్చింది. కాగా గౌరీ లంకేష్ హత్య జరిగిన ఘటనా స్థలంలో లభ్యమైన బుల్లెట్లు, క్యాట్రిడ్జ్‌లను పరిశీలించిన ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం హత్యకు ఉపయోగించిన 7.65 ఎంఎం పిస్టల్నేధార్వాడ్లో 2015, ఆగస్ట్ 30న జరిగిన కన్నడ మేథావి ఎంఎం కల్బుర్గి హత్యలో , అదే ఏడాది ఫిబ్రవరి 16న కొల్హాపూర్‌లో జరిగిన వామపక్ష మేథావి గోవింద్ పన్సారేల హత్యలో వాడినట్టు తేలడం గమనార్హం. కాగా, పన్సారే హత్యకు ఉపయోగించిన రెండో గన్ పూణేలో ఆగస్ట్ 20, 2013లో హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్యలోనూ వాడినట్టు వెల్లడైంది. -
మాది ధర్మ పోరాటం
న్యూఢిల్లీ: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రత్యర్థి పార్టీ బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్, ప్రధాన ప్రత్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆదివారం పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మహాభారతాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికార దాహంతో ఉన్న కౌరవులుగా, కాంగ్రెస్ పార్టీ వారు సత్యం కోసం ధర్మపోరాటం చేస్తున్న పాండవులుగా అభివర్ణించారు. బీజేపీ ఆరెస్సెస్ గొంతుక అయితే.. తమది ప్రజావాణి అని చురకలంటించారు. ఎన్డీయే ప్రభుత్వ పలు నిర్ణయాలనూ రాహుల్ తప్పుబట్టారు. దాదాపు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ.. తీర్మానాన్ని ఆమోదించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. మోదీ.. నిలువెల్లా అవినీతి! ‘ప్రధాని వాస్తవ సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తూ.. సన్నిహితులైన పెట్టుబడిదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ మోదీ పేరుతోనే ఇద్దరు (నీరవ్, లలిత్) తీవ్రమైన అవినీతి కేసుల్లో దోషులుగా ఉన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేశారు. కాంగ్రెస్ 126 రాఫెల్ యుద్ధ విమానాలకోసం చర్చలు జరిపితే.. బీజేపీ అదే మొత్తంతో కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మేం ఒక్కో విమానానికి రూ. 570 కోట్లు పెడితే.. మోదీ అదే విమానానికి రూ.1670 కోట్లు పెడుతున్నారు. మోదీ అవినీతిపై పోరాడటం లేదు. అవినీతికి పాల్పడుతున్నారు’ కురుక్షేత్రను తలపించేలా..: ‘శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగా కాంగ్రెస్ పార్టీది సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం’ ‘సుప్రీం’ తిరుగుబాటుపై..: ‘బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య చాలా తేడా ఉంది’ ఆ మోదీ, ఈ మోదీ కలిసి..: ‘నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు’ రైతులు, మైనార్టీలు, గౌరీ లంకేశ్‌పై..: ‘గౌరీలంకేశ్, కల్బుర్గీలు ప్రశ్నించినందుకే చనిపోవాల్సి వచ్చింది. ఒకవైపు రైతులు సరైన గిట్టుబాటులేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పదండి యోగా చేద్దామని మోదీ పిలుపునివ్వటం సిగ్గుచేటు కాదా? పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడక ఇక్కడే ఉండిపోయిన వారిని వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. తమిళులను వారి భాషను మార్చుకోవాలని బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారం తమకు నచ్చదంటున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తున్నారు’ యువత గురించి: ‘భారత్‌లోని ప్రతి యువతకూ మేం ఓ ఆయుధం. కాంగ్రెస్ పార్టీ మీది. మీ మేధస్సు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మేం ద్వారాలు తెరుస్తాం. దేశానికి మీ (యువత) అవసరం చాలా ఉంది. ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అచ్ఛేదిన్, మీ అకౌంట్లలోకి రూ.15లక్షలు ఇవన్నీ బూటకమే’ యూపీఏ పాలనపై..: ‘ యూపీఏ–2 చివరి రోజుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం కూడా మనుషులమే. పొరపాట్లు చేస్తాం. బీజేపీతో పోలిస్తే మేం విభిన్నం. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకే ఉంది. మోదీ తను దేవుని ప్రతిరూపం అని భావిస్తున్నారు’ కాంగ్రెస్ పునరుత్తేజంపై..: ‘మనం కాంగ్రెస్‌లో మార్పు తీసుకురావాలి. నాయకులు, కార్యకర్తల మధ్యనున్న అడ్డుగోడలను తొలగిస్తాను. ఇందుకోసం సీనియర్ల సలహాలతో ముందుకెళ్దాం. మన మధ్యనున్న విభేదాలు, గ్రూపు తగాదాలను పక్కనపెడదాం. 2019లో కాంగ్రెస్ ఆలోచనవిధానానిదే విజయం. అవసరమైతే రైతు రుణమాఫీ చేస్తాం’ నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, అసమర్థ ఆర్థిక నిర్వాహకుల చేతి నుంచి దేశాన్ని కాపాడినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే మార్గమని ఇందులో పేర్కొన్నారు. ఆర్థికం.. సర్వనాశనం: మన్మోహన్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లీనరీలో తీవ్రంగా విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ.. భ్రమలు కల్పించి మోసం చేసిందన్నారు. ‘ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేకపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి మందగించింది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఆరేళ్లలో రైతు రాబడి రెండింతలు కావాలంటే ఏడాదికి వృద్ధి రేటు కనీసం 12 శాతం ఉండాలి. ఇది ప్రస్తుతం అసాధ్యం’ అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యకు మోదీ ప్రభుత్వం అతితక్కువ ప్రాధాన్యం ఇస్తోందనీ, దాంతో ఈ అంశం ఎన్నడూ లేనంత జటిలంగా తయారైందని మండిపడ్డారు. సరిహద్దులు సురక్షితంగా లేవనీ, సీమాంతర, అంతర్గత ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులపై ప్రతిపౌరుడూ ఆందోళన చెందుతున్నాడని అన్నారు. -
ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం నుంచి 3 రోజులపాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజులపాటు 5 వేదికలపైన ఆరు ప్లీనరీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. తొలిరోజు ఉదయం ‘కన్నడ సాహిత్యం అప్పుడు– ఇప్పుడు’ అనే అంశంపై ప్రముఖ రచయిత్రి ప్రతి భానందకుమార్ ప్రధాన ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం ‘లైఫ్ ఇన్ ఏ డ్యాన్స్’పై ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతారు. 27న ‘సిటిజన్’ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’పై ప్రసంగించనున్నారు. బాలీవుడ్ నటుడు శశికపూర్ కూతురు సంజనా కపూర్ నాటక రంగం, థియేటర్ ఆర్ట్ తదితర అంశాలపై తన అనుభవాలను వివరిస్తారు. 28న ‘మీడియా టుడే’ పై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడతారు. సాయంత్రం జరిగే ప్లీనరీలో సమా చార హక్కు చట్టం కార్యకర్త అరుణారాయ్ ప్రసం గించనున్నారు. వీటితోపాటు విభిన్న సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలు, కళలపై మరో 30కిపైగా సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రతి బింబించే కళారూపాలనూ ప్రదర్శించనున్నారు. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా నగరంలో సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నా రు. ఈసారి స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసర వల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’, శశికపూర్ ‘షేక్సిపీరియానా’, ‘టామాల్టన్’ సినిమాలు ప్రదర్శిస్తారు. వంట చేస్తూ చెప్పే ఉ.సరస్వతి రామాయణం కథ, ‘నన్న నుక్కడ్’ (చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితాసమ్మేళనం, ‘బాంబే బైరాగ్’, వికలాంగుడైన కళాకారుడు బందే నవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముస్తాబవుతున్న వేదికలు పబ్లిక్ స్కూల్లోని ‘తెలంగాణ టూరిజం పెవిలియర్’ వేదికపై 6 ప్లీనరీలు, కార్వే క్యానోసీ, టాటా, గోథె గ్యాలరీల్లో పలు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలకు స్పెయిన్ అతిథిగా హాజరుకానుంది. సాహిత్యోత్సవాలకు ఆ దేశ మేధావులు, రచయితలు, కళాకారులు, అమె రికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. ఉత్సవాలకు ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ కంబారా హాజరుకానున్నారు. బెంగ ళూర్‌లో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతి నాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త ఉ.సరస్వతి, దివంగత పాత్రికేయు రాలు గౌరీ లంకేష్ స్నేహితురాలు, ఆర్టిస్టు పుష్పమేలా పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ దిగ్గజం శశికపూర్, మరో నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌లను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. -
గౌరీ లంకేశ్ హత్య నన్ను మార్చేసింది
శివాజీనగర (బెంగళూరు): తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే పదేపదే సవాల్ చేస్తే రాజ కీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నా రు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన ‘ఈ ఏటి (2017) ప్రెస్‌క్లబ్ వ్యక్తి’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయం చాలా కష్టం. అందులో ఒక బాధ్యత ఉంటుంది. అందుకే నేను దూరంగా ఉంటాను. పదేపదే సవాల్ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యోదంతం తనలో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీనియర్ పాత్రికేయులే తనకు ప్రశ్నించే ధైర్యాన్నిచ్చారని, వారి మార్గదర్శకత్వంలో పెరిగిన ఏకలవ్య శిష్యుడినని చెప్పారు. సమాజంలో బాధ్యతగా మాట్లాడేందుకు ప్రెస్‌క్లబ్ అందించిన పురస్కారం మరింత ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. -
ఇంతకాలం మాట్లాడనందుకు సిగ్గుగా ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయం గురించి ఆమె మాట్లాడింది. భావప్రకటనా స్వేచ్ఛ కోసం ఆమె పోరాడింది. తాను జీవించి ఉండటం కోసం కూడా తాను మాట్లాడింది. రాసింది. ఆమె, నేను కలసి పెరిగాం. గౌరీగా ఎదుగుతున్నప్పుడు కంటే మరణం తరువాతే మేం ఆమె నుంచి నేర్చుకుంటున్నాం’అని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. గౌరీ లంకేశ్ రచనల సంకలనం తెలుగు అనువాదం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని తనని అంతా ప్రశ్నిస్తున్నారని, నిజానికి ఇంతకాలం మాట్లాడనందుకు తాను సిగ్గుపడుతున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతు లేని వారికి తాను బలమైన గొంతుకైనం దుకు గౌరీ హత్య జరిగిందన్నారు. అయితే ఇదే మొదటిది కూడా కాదని గోవింద్ పన్సారే, కల్బుర్గి, దబోల్కర్‌ల వరుసలో గౌరీ లంకేశ్ కూడా హత్యకు గురైందన్నారు. ఇదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నా పదేళ్ల కూతురు సైతం నా క్షేమం గురించి భయపడింది. నా తల్లి దేవుడి ముందు మోకరిల్లింది.. నాకేమీ కాకూడదని.. ఇలా ఎందుకు జరుగుతోంది. ఎందుకీ హత్యలు.. నిశ్శబ్దాన్ని వీడి ప్రశ్నించాలని ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నిశ్శబ్దం సమాజానికి పట్టిన పెద్ద జబ్బు నిశ్శబ్దం ఈ సమాజానికి పట్టిన పెద్దజబ్బు అని.. దాన్ని వదలించుకుని ప్రతిఒక్కరూ మార్పుకి నాంది పలకాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతులు పెగల్చుకుని అణగారిన వర్గాల, అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన మాట్లాడాలని అన్నారు. ‘కొన్ని గొంతులను మూయించి వాళ్లన్నీ సాధించామనుకొంటే పొరపాటు, భిన్నాభిప్రాయాలుంటే చర్చించాలి. కానీ చంపడాన్ని సహించకూడదు. ఇక మాట్లాడాల్సిన సందర్భమిదే. గౌరీ ఒంటరిగా పోరాడింది. ఇప్పుడందరం ఎవరికి వారుగా, కలసికట్టుగా, ఎక్కడైనా, సందర్భమేదైనా మాట్లాడాలి’ అని ప్రకాశ్ రాజ్ గద్గద స్వరంతో అన్నారు. ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ నగరంలోని లామకాన్‌లో గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని గౌరీ సోదరి కవితా లంకేశ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సంపాదకుడు చందన్ గౌడ, ప్రొఫెసర్ సుశీతారూ, సీనియర్ పాత్రికేయురాలు వసంతలక్ష్మి ఆవిష్కరించారు. చందన్‌గౌడ సంపాదకత్వంలో వచ్చిన గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ సత్యాన్ని మరుగుపర్చడం కోసం ముసుగు హత్యలు జరుగుతుంటే మౌనంగా ఉండటం సమాజానికి చేటు చేస్తుందన్నారు. మతం అనేది జీవన విధానమని, హింస మతం లక్షణం కాదని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ చందన్ గౌడ మాట్లాడుతూ భయంలేని సమాజం కోసం గౌరీ లంకేశ్ తుది శ్వాస వరకు పోరాడారని అన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, కృష్ణవంశీ మాట్లాడారు. -
సుపారీ ఆపరేషన్ ఎలా జరుగుతుంది?
తాంబూలాలు ఇచ్చేశారు తన్నుకుని చావండి అన్నది... పాత సేయింగ్... ఇప్పుడు తాంబూలంగా ఒక్క వక్క పొడి ఇస్తే చాలు... సిచ్యుయేషన్ రక్తంలా పండిపోతుంది... ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాల రావు అంటారు... మన చేతికి మట్టి అంటకుండా పని చేయాలని! అలాంటి పనే.. సుపారీ ఇవ్వడం... సుపారీ.. పచ్చనోట్లతో రాసే ఎర్రటి చరిత్ర. సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ సెప్టెంబర్ 5న బెంగళూరులో హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారన్నది ఇంతవరకు తేల్లేదు! అయితే ఒక విషయంలో మాత్రం దర్యాప్తు బృందాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. గౌరీని చంపేయడానికి ఎవరో సుపారీ ఇచ్చి ఉంటారని! ఈ ‘సుపారీ’ ఏంటి? ఇవ్వడం ఏంటి? ఇదే ఈ శనివారం స్పెషల్ స్టోరీ. ఎవడైనా చంపడానికి సుపారీ ఇస్తాడు. చంపించుకోడానికి సుపారీ ఇస్తాడా? ‘నన్ను చంపాలి’ అన్నాడు శివారెడ్డి. గ్లాసులో నీళ్లు బుస్సున పొంగాయి. బాజిరెడ్డికి మతి పోయింది! ఫారుక్ కూడా షాక్ తిన్నాడు. ముగ్గురూ ఓ పెళ్లి రిసెప్షన్లో ఉన్నారు. శివారెడ్డి స్కెచ్ వేస్తున్నాడు. తనను తను చంపించుకోడానికి స్కెచ్! ‘‘ఓ కుర్రాడు టెన్త్ ఫెయిల్ అయి ఇంటికి వచ్చాడనుకో.. అందరూ వాణ్ణి తిడతారు. అదే వాడు రిజల్ట్ చూసుకోగానే దారిలో ఏ నూతిలోనో దూకి, జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో.. అందరూ వాణ్ణి ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడని వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడని సానుభూతి ఉంటుంది. నాకు అది కావాలి. సానుభూతి. అందుకే నా మీద హత్యాప్రయత్నం జరగాలి. కానీ నేను బతకాలి’’. కానీ శివారెడ్డి బతకలేదు. స్కెచ్ తన్నింది. నిజంగానే షాట్ డెడ్! పై సీన్ ‘అతడు’ సినిమాలోది. సినిమాలో శివారెడ్డి పాత్రను చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో.. ఆ మధ్య హైదరాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఒకరు సానుభూతి çసంపాదించి, అప్పుల్ని తప్పించుకోవడం కోసం, తమకు తాము ఆకూవక్క (సుపారీ) ఇప్పించుకున్నారు! మస్తాన్దే మొదటి ఆకూవక్క! ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ హాజీ మస్తాన్ ఇచ్చాడు ఆకూవక్క. మస్తాన్ గ్యాంగ్‌స్టర్. మరో గ్యాంగ్‌స్టర్ యూసఫ్ పటేల్‌ని లేపేయడానికి 10 వేల రూపాయలు సుపారీ ఇచ్చాడు. 1969లో పదివేలంటే పెద్ద మొత్తం. కానీ సుపారీ పండలేదు. యూసఫ్ పటేల్‌ని అతడి బాడీగార్డులు కాపాడారు. అండర్వరల్డ్కు అప్పుడది గోల్డెన్ ఏజ్. ముంబైలో ఎక్కడ చూసినా డబ్బులే. బాలీవుడ్లో డబ్బులు, రియల్ ఎస్టేట్‌లో డబ్బులు. బిజినెస్మెన్ దగ్గర డబ్బులు. ముంబై.. డబ్బుల కేపిటల్ అయిపోయింది. గ్యాంగ్స్టర్లకు పండగ. మామూలుగా అయితే గ్యాంగ్స్టర్ల మధ్య ఫటాఫట్ డే లైట్లో గ్యాంగ్‌వార్స్ జరుగుతాయి. సెలబ్రిటీలను అలా చంపడం కుదరదు. ప్లానింగ్ ఉండాలి. చంపేందుకు ఒక నమ్మకస్తుడైన వాడు ఉండాలి. వాడే.. సుపారీ కిల్లర్. హాజీ మస్తాన్ తొలిసారి సుపారీ ఇచ్చాక.. అండర్ వరల్డ్‌లో సుపారీ ఒక ట్రెడిషన్ అయింది. దెబ్బకు డాన్ అయ్యాడు దావూద్ దావూద్ ఇబ్రహీంని డాన్ చేసింది సుపారీనే! బడా రాజన్‌కు (చోటా రాజన్ గురువు) సుపారీ ఇచ్చి గ్యాంగ్‌స్టర్ అమీర్జాదా నవాబ్ ఖాన్‌ను చంపించాడు దావూద్. అప్పట్నుంచీ ముంబై దావూద్‌కి వణకడం మొదలుపెట్టింది. సుపారీ తీసుకున్న అంతపెద్ద బడా రాజన్ కూడా ఆ తర్వాత ఇంకొకరికి సుపారీ ఇచ్చాడు! రాజన్ నుంచి సుపారీ అందుకున్న ఆ 24 ఏళ్ల యువకుడు డేవిడ్ పరదేశీ. దావూద్ పెద్దన్న హత్య వెనుక ఉన్న ఉన్న ఖాన్ అనే గ్యాంగ్‌స్టర్‌ని ముంబై సెషన్స్ కోర్టు లోపలే కాల్చి చంపేశాడు డేవిడ్. అతడి సుపారీ 50 వేలు. చేతులకు ఎరుపు అంటుకోదు డెబ్బయ్‌లలో గ్యాంగ్స్టర్లు డిపార్ట్మెంట్కు భయపడేవారు కాదు కానీ జర్నలిస్టులకు జడిసేవారు. జర్నలిస్టులు మరీ చికాకు పెడితే సుపారీ ఇచ్చి వాళ్లను వదిలించుకునే వారు. అప్పట్లో అయూబ్ ఖాన్ లాలా అనే వ్యక్తి సుపారీ తీసుకుని ఎం.పి.అయ్యర్ అనే సీనియర్ జర్నలిస్టును చంపేశాడు. చాలా సింపుల్‌గా చంపేశాడు. డ్యూటీ అయ్యాక అయ్యర్ తన కారులో పాన్వెల్ వెళుతున్నాడు. దారి మధ్యలో చెట్టుకు డీ కొని కారు క్రాష్ అయింది. సుపారీ.. కాంట్రాక్ట్ కిల్లింగ్. కాంట్రాక్టు ఇచ్చిందెవరో, కాంట్రాక్టు తీసుకున్నదెవరో కూడా తెలియకుండా మర్డర్ జరిగిపోతుంది. సుపారీ ఇచ్చిన వారి చేతులకు రక్తం అంటదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయట పడితే తప్ప సుపారీ తీసుకున్న వారి చేతుల మీద రక్తపు మరకలు ఉండవు. అంతా గోప్యంగా, గుట్టుగా, స్కిల్‌ఫుల్‌గా జరిగిపోతుంది. కానీ ఎల్లకాలం కాదు. సుపారీతో నోరు పండినట్లే.. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో నేరం పండుతుంది. గుల్షన్ కుమార్ : టి సీరీస్ అధినేత 1997 ఆగస్టు 12. అంధేరీలో జతీశ్వర్ మహాదేవ్ మందిర్ నుంచి బయటికి వస్తున్నాడు గుల్షన్ కుమార్. టెంపుల్ నుంచి బయటికి వచ్చీ రాగానే షాట్ డెడ్! సుపారీ ఇచ్చింది : అబు సలేం సుపారీ తీసుకుంది : నదీమ్. రీజన్ : నదీమ్–శ్రావణ్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు. గుల్షన్‌తో వాళ్లకు విభేదాలు వచ్చాయి. దాన్ని సలేం వాడుకున్నాడు. (మొదట పోలీసులు నదీమ్‌ని అరెస్ట్ చేశారు. మధ్యలోకి అబ్దుల్ రవూఫ్ అనే వాడొచ్చి నేనే గుల్షన్‌ని చంపాను అన్నాడు. కేసు దారి తప్పింది. నదీమ్ ఎస్కేప్.) సురేష్ భగత్ : మట్కా కింగ్ సురేష్ భగత్ 2006 జూన్ 13న మరో ఆరుగురితో కలిసి ఎస్.యు.వి.లో ఆలీబాగ్ వెళుతున్నాడు. ఓ డంపర్ ట్రక్ వచ్చి వీళ్ల కారును గుద్దేసింది. మొత్తం స్పాట్ డెడ్. సుపారీ ఇచ్చింది : భగత్ భార్య జయ, కొడుకు హితేష్. సుపారీ తీసుకుంది : అరుణ్ గావ్లీ అనుచరుడు సుహాస్ రాగ్యే రీజన్ : ప్రేమ, వంచన (భగత్ భార్య, కొడుకు కలిసి 25 లక్షల సుపారీ ఇచ్చి భగత్‌ని చంపించారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది! సుహాస్ రాగ్యేకి, భగత్ భార్యకు లవ్ అఫైర్. ఆ ప్రేమను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల మట్కా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోడానికి సుహాస్ వేసిన స్కెచ్‌లో జయ పడిపోయింది.) అజిత్ దేవానీ : మనీషా కొయిరాలా సెక్రెటరీ అండర్ వరల్డ్ గ్యాంగ్ 2001లో అజిత్ దేవానీని చంపేసింది. సుపారీ ఇచ్చింది : అబూ సలేం. సుపారీ తీసుకుంది : దీపక్ సింగ్ (ఉత్తర ప్రదేశ్) రీజన్ : గ్యాంగ్స్టర్లకు డబ్బు ఇవ్వకపోవడం. (మనీషాకు ప్రొటెక్షన్ ఇస్తున్నందుకు అబు సలేం డబ్బు డిమాండ్ చేశాడు. అజిత్ తల అడ్డంగా ఊపాడు. అజిత్ హత్య తర్వాత విక్రమ్‌ఘర్ పోలీసులు దీపక్‌సింగ్ అలియాస్ దీపును కాల్చి చంపారు) రాకేశ్ రోషన్ : బాలీవుడ్ నిర్మాత 2002 జనవరి 21. కారులో వెళుతున్న రాకేశ్ రోషన్‌పై ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఒక బులెట్ ఎడమ చేతిలోకి, ఇంకొటి ఛాతీలోకి దిగబడింది. సుపారీ ఇచ్చింది : అబూ సలేం సుపారీ తీసుకుంది : సునీల్ విఠల్ గైక్వాడ్, సచిన్ కాంబ్లే. కారణం : శివసేన నిన్ను ఎల్లకాలం కాపాడలేదని ఒక హెచ్చరిక చేయడం. (రాకేశ్ రోషన్ప్రాణాలు పోకుండా ఎంతో ఒడుపుగా కాల్పులు జరిపారు సునీల్, సచిన్) పవన్ రాజే నింబాల్కర్: కాంగ్రెస్ లీడర్ 2006 జూన్ 3న ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్ వే పైన కారులో వెళుతున్న నింబల్కర్ను, అతడి డ్రైవర్ సమద్ ఖాజీని కాల్చి చంపారు. సుపారీ ఇచ్చింది : ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ పదమ్‌సింహ్ పాటిల్. సుపారీ తీసుకుంది : పరస్మల్ జైన్, దినేశ్ తివారీ. రీజన్: రాజకీయ శత్రుత్వం. (పరస్మల్ జైన్, దినేశ్ తివారీ మోటర్‌బైక్ మీద కారును అనుసరించి, సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్‌ను పూర్తి చేశారు. అయితే సుపారీగా వీళ్లకు ఇస్తానన్న కోటి రూపాయలను పదమ్‌సింహ్ పాటిల్ ఇవ్వలేదు. 30 లక్షలు మాత్రమే ఇచ్చాడు! నింబల్కర్పై మొదట వీళ్లు చేసిన రెండు అటెంప్ట్ ఫెయిల్ అవడంతో 70 లక్షలు కట్ అయ్యాయి.) సునీల్ లొహారియా : ముంబై బిల్డర్ 2013 ఫిబ్రవరి 16. నవీ ముంబైలో పట్ట పగలు సునీల్ లొహారియాను చంపేశారు. ఇద్దరు ఆగంతకులలో ఒకడు లొహారియాపై అదే పనిగా కాల్పులు జరిపాడు. ఇంకొకడు ఆయన తల నరికేశాడు. సుపారీ ఇచ్చింది : సురేశ్ బిజిలానీ అనే మరో బిల్డర్. సుపారీ తీసుకుంది : శామ్యూల్ అమోలిక్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్! రీజన్ : రియల్ ఎస్టేట్ గొడవలు. (నవీ ముంబైలో అక్రమ నిర్మాణాలపై ఆర్.టి.ఐ. కేసును ఫైల్ చేసినందుకు కూడా ప్రత్యర్థులు లొహారియాపై పగబట్టారు.) జ్యోతిర్మయీ డే (జే డే): క్రైమ్ రిపోర్టర్, మిడ్ డే మోటార్‌బైక్ మీద వచ్చిన ఆగంతుకులు 2011 జూన్‌లో జే డే ని కాల్చి చంపారు. సుపారీ ఇచ్చింది : చోటా రాజన్ సుపారీ తీసుకుంది : సతీష్ కాలియా రీజన్ : అండర్ వరల్డ్‌కు వ్యతిరేకంగా కూపీలు లాగడం. (ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జిగ్నా ఓరా అనే లేడీ జర్నలిస్టును కూడా అరెస్ట్ చేశారు. 5 లక్షల రూపాయల సుపారీ చేతులు మారిన ఈ కేసులో జిగ్నాకు కూడా కొంత భాగం ఉందన్న అరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేకపోవడంతో జిగ్నా బెయిల్ మీద బయటికి వచ్చారు) సుపారీ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సుపారీ ఇచ్చేవాళ్లు నేరుగా ఇవ్వరు. మధ్యవర్తులపై ఆధారపడతారు. మధ్యవర్తులు ఒక కిరాయి హంతకుడిని ఏర్పాటు చేస్తారు. ఎవర్నైతే చంపాలో వాళ్ల ఫొటో ఆ హంతకుడికి చేరుతుంది. టార్గెట్ లొకేషన్ గురించీ చెబుతారు. కొన్ని కేసుల్లో రెక్కీ కూడా జరుగుతుంది. ఆ వివరాలన్నీ సుపారీ ఇచ్చిన వాళ్లకు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. సుపారీ తీసుకున్న వాడు ఎందుకు చంపాలి అనే ప్రశ్న వెయ్యకూడదు. చంపాలి. అంతే. సుపారీ తీసుకున్న వాడికి తనకు సుపారీ ఇచ్చిన వారి గురించి తెలియనివ్వరు. కానీ సుపారీ ఇచ్చినవాడికి సుపారీ తీసుకున్న వాడి వివరాలు కచ్చితంగా తెలియజేస్తారు. ఇప్పుడంటే సుపారీ లక్షల్లో ఉంటోంది కానీ, 1980ల వరకు 50 వేల రూపాయలకు మించి ఉండేది కాదు. సుపారీ అనే మాట ఎలా వచ్చింది? ముంబైలో ఇప్పుడు మాహిమ్ అనే ప్రాంతం ఉంది కదా. 13వ శతాబ్దంలో అదొక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి రాజు భీమ్ దేవ్. అక్కడి మహేమీ అనే తెగకు అతడు అధినాయకుడు. భీమ్ ఒక ఆసక్తికరమైన సంప్రదాయాన్ని పాటించేవారు. ఏదైనా ఒక ముఖ్యమైన బాధ్యతను ఎవరికైనా అప్పగించాలని అనుకున్నప్పుడు నేరుగా అసైన్ చేసేవాడు కాదు. ముఖ్యుల్ని పిలిచి మీటింగ్ పెట్టేవాడు. ఆ తర్వాత చక్కటి భోజనం పెట్టేవాడు. భోజనం తర్వాత ఒక వెండి పళ్లెంలో ఆకూ వక్క పెట్టి వాళ్ల మధ్యలో ఉంచేవాడు. అప్పుడు అందరికీ అర్థమైపోయేది.. రాజుగారేదో టఫ్ టాస్క్ అప్పగించబోతున్నారని. ఆ కఠినమైన బాధ్యతను స్వీకరించడానికి ముందుకు వచ్చినవాళ్లు వెండి పళ్లెంలోని ఆకూవక్క తీసుకునేవారు. ‘ఎస్.. ఐ కెన్ డు’ అనే అర్థం వచ్చేలా! వాళ్లకు ఆ పని అప్పగించేవారు రాజుగారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఆకూవక్క అందుకుంటే? ఫైనల్ డెసిషన్ భీమ్ దేవ్‌దే. ఒకర్ని ఎన్నుకుని, మిగతావారిని ఆకూవక్కతో పంపించేవారు. తర్వాత రహస్యంగా మంతనాలు జరిగేవి. అలా వచ్చిందే సుపారీ అనే మాట. -
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక అడుగు..
-
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక అడుగు
-
లంకేశ్ హత్య కేసులో పురోగతి
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో హంతకుల ఊహాచిత్రాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విడుదల చేసింది. సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన ఇంటి ముందు లంకేశ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆమె హత్య జరిగిన 5 వారాల అనంతరం ఘటనకు కారణమని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మూడు ఊహా చిత్రాలను 21 మంది సభ్యుల సిట్ బృందం మీడియాకు విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరు నిపుణులైన చిత్రకారులు ఈ చిత్రాల్ని గీశారని, అందులో రెండు చిత్రాలు ఒక వ్యక్తివేనని సిట్ చీఫ్ బీ.కే సింగ్ బెంగళూరులో వెల్లడించారు. ఈ కేసులో దాదాపు 200–250 మందిని విచారించామని, హంతకులు దేశీ తయారీ 7.65 ఎం.ఎం తుపాకీ వాడారని తెలిపారు. ‘లంకేశ్ హత్యకు వృత్తిపరమైన విభేదాలు కారణం కాదని ఇంతకుముందే చెప్పాం. ఈ ఘటనలో ఏ జర్నలిస్టు ప్రమేయం లేదు. అయితే అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. సదరు నిందితులిద్దర్నీ ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా భావిస్తున్నామని, 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చని, కనీసం ఏడు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆ హత్యలతో సారూప్యత లేదు మహారాష్ట్రలోని దబోల్కర్, పన్సారే, కర్ణాటకలోని కల్బుర్గీ హత్యలకు సారూప్యత ఉన్నట్లు చెప్పలేమని సింగ్ పేర్కొన్నారు. సిట్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఘటనకు సంబంధమున్న రెండు వీడియోలను సిట్ మీడియాకు అందజేసింది. ఆమె ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్నూ సిట్ విడుదల చేసింది. -
చంపినా చావని ప్రశ్న..!
ఆలోచనం నాకు నచ్చిన విధంగా నేను పాడుతానన్న బసవన్న లాగే గౌరీ లంకేశ్ కూడా ‘‘నా మనసు ఏది చెప్తే అదే మాట్లాడుతాను’’ అన్నారు. గౌరీని హత్య చేయడమంటే ప్రశ్నని అంతమొందించడానికి ప్రయత్నించడమే. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కన్నడ రచయిత పి.లంకేశ్ బండల సందుల్లోంచి చెట్లు మొలిచినట్టు ‘రాళ్ళూ... కరిగే వేళ’వస్తుందని, మనుష్యుల మధ్య కుల అంతరాలు తొలిగిపోతాయని విశ్వసించాడు. ఆ లక్ష్యంతో తన పేరుతోనే లంకేశ్ అనే పత్రిక కూడా పెట్టారు. తండ్రి ఇచ్చిన అభ్యుదయ వారసత్వాన్ని ‘గౌరీ లంకేశ్ పత్రిక’గా కొనసాగించారు గౌరీ లంకేశ్. గత వారం ఆమె హత్యకి గురి అయ్యారు. ధబోల్కర్, కల్బుర్గి వంటి హేతువాదుల హత్యలను ఈ సంఘటన గుర్తు చేసింది. కల్బుర్గి, లంకేశ్‌లు ఇద్దరూ లింగాయత్ కులం వారే. వర్ణ, కుల లింగ వివక్షకు వ్యతిరేకంగా బసవన్న పన్నెండవ శతాబ్దంలో ఒక మహోద్యమం చేశారు. సాంఘిక సమానత్వం ఈ ఉద్యమ లక్ష్యం. ‘కాయ కావే కైలాస’ (కాయకష్టం తోటే కైలాసం) ఈ ఉద్యమ నినాదం. ఈ ఉద్యమ వారసులే లింగాయత్‌లు. కల్బుర్గి బసవుడి ఉద్యమం ఫలితంగా వచ్చిన ‘వచన’ అనే గొప్ప సాహిత్య సంప్రదాయం మీద విస్తృత పరిశోధన చేశారు. వచనాలని కెంపుల కాంతులుగా పేర్కొన్నారు కల్బుర్గి. ఆయన వచన సాహిత్యం వేదాలు, బైబిల్, ఖురాన్ అంత పవిత్రమైనవని భావిం చారు. కల్బుర్గి పరిశోధనలు ఇచ్చిన చైతన్యం లింగాయత్‌ని ప్రత్యేక మతంగా గుర్తించాలనే ఉద్యమానికి దోహదం చేసింది. ఈ ప్రత్యేక మత సూత్రీకరణ హిందుత్వ వాదులకు కోపం తెప్పించింది. కల్బుర్గి తన పరిశోధనతో బసవేశ్వరుని చెల్లి నాగాలాంబికకు, చెప్పులు కుట్టే కులంవాడైన దోహర కక్కయ్య కవికి పుట్టిన సంతానమే చెన్నబసవేశ్వరుడు అని తెలుసుకొన్నారు. ఈ విషయాన్నీ ప్రకటించడం వలన బసవుడి స్ఫూర్తిని వదిలేసి ‘మఠాలుగా’ అవతరించిన లింగాయత్ మత పెద్దల ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలితంగా కల్బుర్గి అనేక బెదిరింపులని ఎదుర్కొన్నారు. ఆయనికి పోలీస్ రక్షణ కల్పించాల్సి వచ్చింది. కల్బుర్గి తాను ఎంతో ప్రేమించిన వచనాలలో చెప్పినట్టు ‘‘పిడుగులతో పోరాడగల యోధులకు గొడుగులు ఎందుకు’’ అనుకున్నాడో ఏమో గానీ కొన్ని రోజుల తర్వాత రక్షణ వద్దన్నాడు. హత్యకు గురయ్యాడు. నాకు నచ్చిన విధంగా నేను పాడుతాను అన్నాడు బసవన్న. గౌరీ లంకేశ్ కూడా ‘‘నా మనసు ఏది చెప్తే అదే మాట్లాడతాను’’ అని భావించారు. ఆమె బసవుడి వచనంలో ‘‘సిరియాళుడిని వ్యాపారి అని నేనెలా చెప్తాను, మచ్చయ్యని చాకలి అని, కక్కయ్యని చెప్పులు కుట్టేవాడని, నన్ను నేను బ్రాహ్మణుడినని ఎలా చెప్పుకుంటాను? అలా చెప్తే కూడల సంగమయ్య నవ్వడా’’ అని అన్నట్టు కుల వ్యవస్థని తిరస్కరించే దృక్పథాన్ని ఆలోచనల్లో, రాతల్లో చూపించారు. పెరుమాళ్ మురుగన్ నవల ‘‘వన్ పార్ట్ వుమన్’’పై ఛాందసవాదులు దాడులు చేసినపుడు, ఎస్.ఎల్ భైరప్ప నవల ‘పర్వ’ని పోలిక తెచ్చి, ఈ రెండు నవలల్లోనూ సంతానహీనులైన స్త్రీలు ఇతర పురుషుల నుంచి వీర్య దానాన్ని స్వీకరించారు కదా, మరి మీరు భైరప్పని ఏమీ అనకుండా, మురుగన్‌పై ఎందుకు దాడి చేస్తున్నారు? భైరప్ప బ్రాహ్మణుడు, మురుగన్ తక్కువ కులం వాడనా? అంటూ ప్రశ్నించారు.. గౌరీని హత్య చేయడమంటే కల్బుర్గిని హత్య చేయటం లాగే ప్రశ్నని అంతమొందించడానికి ప్రయత్నించడమే అని చాలా మంది మేధావుల అభిప్రాయం. ‘‘వారు మమ్మల్ని పాతి పెట్టాలనుకొన్నారు, కానీ వారికి మేము విత్తనాలం అని తెలి యదు’’ అంటుందో మెక్సికన్ సామెత. అలాగే ఎంత మందిని చంపినా కొత్త ప్రశ్నలు తిరిగి తిరిగి మొలుస్తూనే ఉంటాయి కదా. తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన మొదటి కోకిల పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి వీర శైవాన్ని నచ్చాడు, స్వీకరించాడు. బసవన్న గురించి విన్నాడు. బసవన్న ప్రభావంలో పడ్డాడు. తలమునకలుగా భక్తిలో ఓలలాడాడు. ద్విపదలో భక్తుల కథలతో ఏడు ఆశ్వాసాల బసవ పురాణం రచించాడు. అయితే పాల్కురికి మత ఆవేశం అవధుల్లేని ఉద్రేకం. అతను ‘‘జన సమయ మతస్తుల శిరముల దునిమి, మును విష్ణు సమయుల ముక్కులు గోసి యద్వైతులను హతహతముగా ద్రోలి’’... ఎంత హింసయినా సరే చేసి శివభక్తిని ప్రచారం చేయాలి అన్నాడు. కానీ ఆనాడు ఉవ్వెత్తున లేచిన వీర శైవంలోని ఉద్రేకం, ఉద్వేగం కాలగర్భంలో కలిసిపోయాయి. పాల్కురికి జైనుల శిరములు దునుమాలని కోరుకున్నాడు గాని ఈ రోజు భారతదేశంలో శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం సహజీవనం చేస్తున్నాయి. ఎంతో కొంత వీర శైవం లక్షణాలు ఉన్న బీజేపీకి నేడు ఒక జైనుడు జాతీయ అధ్యక్షుడు. ఈ విషయాలు అటుంచుతే ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి పూర్తిగా మోదీ వ్యక్తిత్వమే కారణం. ఈ గెలుపు మోదీ గెలుపు మాత్రమే. మోదీ ఒక చాయ్‌వాలా, ఒక బీసీ. అభివృద్ధి కాముకుడు. ఇవి ఓటర్లను అమితంగా ఆకర్షించాయి. అలాంటప్పుడు ఈ మత అసహిష్ణుతను ఆయన ఎందుకని తన ఖాతాలోకి తీసుకోవాలి? ఇప్పుడు నా చింత ఇది కాదు... ‘‘మోదీ చాయ్ వాలా అమ్మా, భేటీ బచావ్ – భేటీ పడావ్ అన్నాడమ్మా’’ అని ప్రేమగా చెప్పుకునే నా కూతురికి గౌరీ హత్య గురించి అడిగితే ఏమని చెప్పాలి?. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966