సుపారీ ఆపరేషన్‌ ఎలా జరుగుతుంది? | How does the supri operation happen? | Sakshi
Sakshi News home page

ఆకూవక్క

Published Sat, Oct 21 2017 12:32 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

How does the supri operation happen? - Sakshi

తాంబూలాలు ఇచ్చేశారు తన్నుకుని చావండి అన్నది... పాత సేయింగ్‌... ఇప్పుడు తాంబూలంగా ఒక్క వక్క పొడి ఇస్తే చాలు... సిచ్యుయేషన్‌ రక్తంలా పండిపోతుంది... ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాల రావు అంటారు... మన చేతికి మట్టి అంటకుండా పని చేయాలని! అలాంటి పనే.. సుపారీ ఇవ్వడం... సుపారీ.. పచ్చనోట్లతో రాసే ఎర్రటి చరిత్ర.

సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌ సెప్టెంబర్‌ 5న బెంగళూరులో హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారన్నది ఇంతవరకు తేల్లేదు! అయితే ఒక విషయంలో మాత్రం దర్యాప్తు బృందాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. గౌరీని చంపేయడానికి ఎవరో సుపారీ ఇచ్చి ఉంటారని! ఈ ‘సుపారీ’ ఏంటి? ఇవ్వడం ఏంటి? ఇదే ఈ శనివారం స్పెషల్‌ స్టోరీ.  


ఎవడైనా చంపడానికి సుపారీ ఇస్తాడు. చంపించుకోడానికి సుపారీ ఇస్తాడా? ‘నన్ను చంపాలి’ అన్నాడు శివారెడ్డి. గ్లాసులో నీళ్లు బుస్సున పొంగాయి. బాజిరెడ్డికి మతి పోయింది! ఫారుక్‌ కూడా షాక్‌ తిన్నాడు. ముగ్గురూ ఓ పెళ్లి రిసెప్షన్‌లో ఉన్నారు. శివారెడ్డి స్కెచ్‌ వేస్తున్నాడు. తనను తను చంపించుకోడానికి స్కెచ్‌! ‘‘ఓ కుర్రాడు టెన్త్‌ ఫెయిల్‌ అయి ఇంటికి వచ్చాడనుకో.. అందరూ వాణ్ణి తిడతారు. అదే వాడు రిజల్ట్‌ చూసుకోగానే దారిలో ఏ నూతిలోనో దూకి, జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో.. అందరూ వాణ్ణి ఓదారుస్తారు.

ఫస్ట్‌ కేసులో పరీక్ష తప్పాడని వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్‌ కేసులో చచ్చి బతికాడని సానుభూతి ఉంటుంది. నాకు అది కావాలి. సానుభూతి. అందుకే నా మీద హత్యాప్రయత్నం జరగాలి. కానీ నేను బతకాలి’’. కానీ శివారెడ్డి బతకలేదు. స్కెచ్‌ తన్నింది. నిజంగానే షాట్‌ డెడ్‌! పై సీన్‌ ‘అతడు’ సినిమాలోది. సినిమాలో శివారెడ్డి పాత్రను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యారో ఏమో.. ఆ మధ్య హైదరాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఒకరు సానుభూతి çసంపాదించి, అప్పుల్ని తప్పించుకోవడం కోసం, తమకు తాము ఆకూవక్క (సుపారీ) ఇప్పించుకున్నారు!

మస్తాన్‌దే మొదటి ఆకూవక్క!
ఇండియాలో ఫస్ట్‌ ఫస్ట్‌ హాజీ మస్తాన్‌ ఇచ్చాడు ఆకూవక్క. మస్తాన్‌ గ్యాంగ్‌స్టర్‌. మరో గ్యాంగ్‌స్టర్‌ యూసఫ్‌ పటేల్‌ని లేపేయడానికి 10 వేల రూపాయలు సుపారీ ఇచ్చాడు. 1969లో పదివేలంటే పెద్ద మొత్తం. కానీ సుపారీ పండలేదు. యూసఫ్‌ పటేల్‌ని అతడి బాడీగార్డులు కాపాడారు. అండర్‌వరల్డ్‌కు అప్పుడది గోల్డెన్‌ ఏజ్‌. ముంబైలో ఎక్కడ చూసినా డబ్బులే. బాలీవుడ్‌లో డబ్బులు, రియల్‌ ఎస్టేట్‌లో డబ్బులు.

బిజినెస్‌మెన్‌ దగ్గర డబ్బులు. ముంబై.. డబ్బుల కేపిటల్‌ అయిపోయింది. గ్యాంగ్‌స్టర్‌లకు పండగ. మామూలుగా అయితే గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ఫటాఫట్‌ డే లైట్‌లో గ్యాంగ్‌వార్స్‌ జరుగుతాయి. సెలబ్రిటీలను అలా చంపడం కుదరదు. ప్లానింగ్‌ ఉండాలి. చంపేందుకు ఒక నమ్మకస్తుడైన వాడు ఉండాలి. వాడే.. సుపారీ కిల్లర్‌. హాజీ మస్తాన్‌ తొలిసారి సుపారీ ఇచ్చాక.. అండర్‌ వరల్డ్‌లో సుపారీ ఒక ట్రెడిషన్‌ అయింది.

దెబ్బకు డాన్‌ అయ్యాడు దావూద్‌
దావూద్‌ ఇబ్రహీంని డాన్‌ చేసింది సుపారీనే! బడా రాజన్‌కు (చోటా రాజన్‌ గురువు) సుపారీ ఇచ్చి గ్యాంగ్‌స్టర్‌ అమీర్జాదా నవాబ్‌ ఖాన్‌ను చంపించాడు దావూద్‌. అప్పట్నుంచీ ముంబై దావూద్‌కి వణకడం మొదలుపెట్టింది. సుపారీ తీసుకున్న అంతపెద్ద బడా రాజన్‌ కూడా ఆ తర్వాత ఇంకొకరికి సుపారీ ఇచ్చాడు! రాజన్‌ నుంచి సుపారీ అందుకున్న ఆ 24 ఏళ్ల యువకుడు డేవిడ్‌ పరదేశీ. దావూద్‌ పెద్దన్న హత్య వెనుక ఉన్న ఉన్న ఖాన్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ని ముంబై సెషన్స్‌ కోర్టు లోపలే కాల్చి చంపేశాడు డేవిడ్‌. అతడి సుపారీ 50 వేలు.

చేతులకు ఎరుపు అంటుకోదు
డెబ్బయ్‌లలో గ్యాంగ్‌స్టర్‌లు డిపార్ట్‌మెంట్‌కు భయపడేవారు కాదు కానీ జర్నలిస్టులకు జడిసేవారు. జర్నలిస్టులు మరీ చికాకు పెడితే సుపారీ ఇచ్చి వాళ్లను వదిలించుకునే వారు. అప్పట్లో అయూబ్‌ ఖాన్‌ లాలా అనే వ్యక్తి సుపారీ తీసుకుని ఎం.పి.అయ్యర్‌ అనే సీనియర్‌ జర్నలిస్టును చంపేశాడు. చాలా సింపుల్‌గా చంపేశాడు. డ్యూటీ అయ్యాక అయ్యర్‌ తన కారులో పాన్వెల్‌ వెళుతున్నాడు. దారి మధ్యలో చెట్టుకు డీ కొని కారు క్రాష్‌ అయింది.

సుపారీ.. కాంట్రాక్ట్‌ కిల్లింగ్‌. కాంట్రాక్టు ఇచ్చిందెవరో, కాంట్రాక్టు తీసుకున్నదెవరో కూడా తెలియకుండా మర్డర్‌ జరిగిపోతుంది. సుపారీ ఇచ్చిన వారి చేతులకు రక్తం అంటదు. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌లో బయట పడితే తప్ప సుపారీ తీసుకున్న వారి చేతుల మీద రక్తపు మరకలు ఉండవు. అంతా గోప్యంగా, గుట్టుగా, స్కిల్‌ఫుల్‌గా జరిగిపోతుంది. కానీ ఎల్లకాలం కాదు. సుపారీతో నోరు పండినట్లే.. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌తో నేరం పండుతుంది.   

గుల్షన్‌ కుమార్‌ : టి సీరీస్‌ అధినేత
1997 ఆగస్టు 12. అంధేరీలో జతీశ్వర్‌ మహాదేవ్‌ మందిర్‌ నుంచి బయటికి వస్తున్నాడు గుల్షన్‌ కుమార్‌. టెంపుల్‌ నుంచి బయటికి వచ్చీ రాగానే షాట్‌ డెడ్‌!
సుపారీ ఇచ్చింది : అబు సలేం
సుపారీ తీసుకుంది : నదీమ్‌.
రీజన్‌ : నదీమ్‌–శ్రావణ్‌ బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌లు. గుల్షన్‌తో వాళ్లకు విభేదాలు వచ్చాయి. దాన్ని సలేం వాడుకున్నాడు.
(మొదట పోలీసులు నదీమ్‌ని అరెస్ట్‌ చేశారు. మధ్యలోకి అబ్దుల్‌ రవూఫ్‌ అనే వాడొచ్చి నేనే గుల్షన్‌ని చంపాను అన్నాడు. కేసు దారి తప్పింది. నదీమ్‌ ఎస్కేప్‌.)
 

సురేష్‌ భగత్‌ : మట్కా కింగ్‌  
సురేష్‌ భగత్‌ 2006 జూన్‌ 13న మరో ఆరుగురితో కలిసి ఎస్‌.యు.వి.లో ఆలీబాగ్‌ వెళుతున్నాడు. ఓ డంపర్‌ ట్రక్‌ వచ్చి వీళ్ల కారును గుద్దేసింది. మొత్తం స్పాట్‌ డెడ్‌.
సుపారీ ఇచ్చింది : భగత్‌ భార్య జయ, కొడుకు హితేష్‌.
సుపారీ తీసుకుంది : అరుణ్‌ గావ్లీ అనుచరుడు సుహాస్‌ రాగ్యే
రీజన్‌ : ప్రేమ, వంచన (భగత్‌ భార్య, కొడుకు కలిసి 25 లక్షల సుపారీ ఇచ్చి భగత్‌ని చంపించారని పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది! సుహాస్‌ రాగ్యేకి, భగత్‌ భార్యకు లవ్‌ అఫైర్‌. ఆ ప్రేమను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల మట్కా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోడానికి సుహాస్‌ వేసిన స్కెచ్‌లో జయ పడిపోయింది.)
 

అజిత్‌ దేవానీ : మనీషా కొయిరాలా సెక్రెటరీ
అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌ 2001లో అజిత్‌ దేవానీని చంపేసింది.
సుపారీ ఇచ్చింది : అబూ సలేం.
సుపారీ తీసుకుంది : దీపక్‌ సింగ్‌ (ఉత్తర ప్రదేశ్‌)
రీజన్‌ : గ్యాంగ్‌స్టర్‌లకు డబ్బు ఇవ్వకపోవడం. (మనీషాకు ప్రొటెక్షన్‌ ఇస్తున్నందుకు అబు సలేం డబ్బు డిమాండ్‌ చేశాడు. అజిత్‌ తల అడ్డంగా ఊపాడు. అజిత్‌ హత్య తర్వాత విక్రమ్‌ఘర్‌ పోలీసులు దీపక్‌సింగ్‌ అలియాస్‌ దీపును కాల్చి చంపారు)
 

రాకేశ్‌ రోషన్‌ : బాలీవుడ్‌ నిర్మాత
2002 జనవరి 21. కారులో వెళుతున్న రాకేశ్‌ రోషన్‌పై ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఒక బులెట్‌ ఎడమ చేతిలోకి, ఇంకొటి ఛాతీలోకి దిగబడింది.
సుపారీ ఇచ్చింది : అబూ సలేం
సుపారీ తీసుకుంది : సునీల్‌ విఠల్‌ గైక్వాడ్, సచిన్‌ కాంబ్లే.
కారణం : శివసేన నిన్ను ఎల్లకాలం కాపాడలేదని ఒక హెచ్చరిక చేయడం.
(రాకేశ్‌ రోషన్‌ప్రాణాలు పోకుండా ఎంతో ఒడుపుగా కాల్పులు జరిపారు సునీల్, సచిన్‌)
 

పవన్‌ రాజే నింబాల్కర్‌: కాంగ్రెస్‌ లీడర్‌
2006 జూన్‌ 3న ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్‌ వే పైన కారులో వెళుతున్న నింబల్కర్‌ను, అతడి డ్రైవర్‌ సమద్‌ ఖాజీని కాల్చి చంపారు.
సుపారీ ఇచ్చింది : ఉస్మానాబాద్‌ (మహారాష్ట్ర) ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ పదమ్‌సింహ్‌ పాటిల్‌.
సుపారీ తీసుకుంది : పరస్మల్‌ జైన్, దినేశ్‌ తివారీ.
రీజన్‌: రాజకీయ శత్రుత్వం.
(పరస్మల్‌ జైన్, దినేశ్‌ తివారీ మోటర్‌బైక్‌ మీద కారును అనుసరించి, సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్‌ను పూర్తి చేశారు. అయితే సుపారీగా వీళ్లకు ఇస్తానన్న కోటి రూపాయలను పదమ్‌సింహ్‌ పాటిల్‌ ఇవ్వలేదు. 30 లక్షలు మాత్రమే ఇచ్చాడు! నింబల్కర్‌పై మొదట వీళ్లు చేసిన రెండు అటెంప్ట్‌ ఫెయిల్‌ అవడంతో 70 లక్షలు కట్‌ అయ్యాయి.)
 

సునీల్‌ లొహారియా : ముంబై బిల్డర్‌
2013 ఫిబ్రవరి 16. నవీ ముంబైలో పట్ట పగలు సునీల్‌ లొహారియాను చంపేశారు. ఇద్దరు ఆగంతకులలో ఒకడు లొహారియాపై అదే పనిగా కాల్పులు జరిపాడు. ఇంకొకడు ఆయన తల నరికేశాడు.
సుపారీ ఇచ్చింది : సురేశ్‌ బిజిలానీ అనే మరో బిల్డర్‌.
సుపారీ తీసుకుంది : శామ్యూల్‌ అమోలిక్‌ అనే రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌!
రీజన్‌ : రియల్‌ ఎస్టేట్‌ గొడవలు. (నవీ ముంబైలో అక్రమ నిర్మాణాలపై ఆర్‌.టి.ఐ. కేసును ఫైల్‌ చేసినందుకు కూడా ప్రత్యర్థులు లొహారియాపై పగబట్టారు.)
 


జ్యోతిర్మయీ డే (జే డే): క్రైమ్‌ రిపోర్టర్, మిడ్‌ డే
మోటార్‌బైక్‌ మీద వచ్చిన ఆగంతుకులు 2011 జూన్‌లో జే డే ని కాల్చి చంపారు.
సుపారీ ఇచ్చింది : చోటా రాజన్‌
సుపారీ తీసుకుంది : సతీష్‌ కాలియా
రీజన్‌ : అండర్‌ వరల్డ్‌కు వ్యతిరేకంగా కూపీలు లాగడం.
(ఈ కేసులో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు జిగ్నా ఓరా అనే లేడీ జర్నలిస్టును కూడా అరెస్ట్‌ చేశారు. 5 లక్షల రూపాయల సుపారీ చేతులు మారిన ఈ కేసులో జిగ్నాకు కూడా కొంత భాగం ఉందన్న అరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేకపోవడంతో జిగ్నా బెయిల్‌ మీద బయటికి వచ్చారు)              

సుపారీ ఆపరేషన్‌ ఎలా జరుగుతుంది?
సుపారీ ఇచ్చేవాళ్లు నేరుగా ఇవ్వరు. మధ్యవర్తులపై ఆధారపడతారు. మధ్యవర్తులు ఒక కిరాయి హంతకుడిని ఏర్పాటు చేస్తారు. ఎవర్నైతే చంపాలో వాళ్ల ఫొటో ఆ హంతకుడికి చేరుతుంది. టార్గెట్‌ లొకేషన్‌ గురించీ చెబుతారు. కొన్ని కేసుల్లో రెక్కీ కూడా జరుగుతుంది. ఆ వివరాలన్నీ సుపారీ ఇచ్చిన వాళ్లకు ఎప్పటికప్పుడు అందుతుంటాయి.

సుపారీ తీసుకున్న వాడు ఎందుకు చంపాలి అనే ప్రశ్న వెయ్యకూడదు. చంపాలి. అంతే. సుపారీ తీసుకున్న వాడికి తనకు సుపారీ ఇచ్చిన వారి గురించి తెలియనివ్వరు. కానీ సుపారీ ఇచ్చినవాడికి సుపారీ తీసుకున్న వాడి వివరాలు కచ్చితంగా తెలియజేస్తారు. ఇప్పుడంటే సుపారీ లక్షల్లో ఉంటోంది కానీ, 1980ల వరకు 50 వేల రూపాయలకు మించి ఉండేది కాదు.


సుపారీ అనే మాట ఎలా వచ్చింది?
ముంబైలో ఇప్పుడు మాహిమ్‌ అనే ప్రాంతం ఉంది కదా. 13వ శతాబ్దంలో అదొక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి రాజు భీమ్‌ దేవ్‌. అక్కడి మహేమీ అనే తెగకు అతడు అధినాయకుడు. భీమ్‌ ఒక ఆసక్తికరమైన సంప్రదాయాన్ని పాటించేవారు. ఏదైనా ఒక ముఖ్యమైన బాధ్యతను ఎవరికైనా అప్పగించాలని అనుకున్నప్పుడు నేరుగా అసైన్‌ చేసేవాడు కాదు. ముఖ్యుల్ని పిలిచి మీటింగ్‌ పెట్టేవాడు. ఆ తర్వాత చక్కటి భోజనం పెట్టేవాడు.

భోజనం తర్వాత ఒక వెండి పళ్లెంలో ఆకూ వక్క పెట్టి వాళ్ల మధ్యలో ఉంచేవాడు. అప్పుడు అందరికీ అర్థమైపోయేది.. రాజుగారేదో టఫ్‌ టాస్క్‌ అప్పగించబోతున్నారని. ఆ కఠినమైన బాధ్యతను స్వీకరించడానికి ముందుకు వచ్చినవాళ్లు వెండి పళ్లెంలోని ఆకూవక్క తీసుకునేవారు. ‘ఎస్‌.. ఐ కెన్‌ డు’ అనే అర్థం వచ్చేలా! వాళ్లకు ఆ పని అప్పగించేవారు రాజుగారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఆకూవక్క అందుకుంటే? ఫైనల్‌ డెసిషన్‌ భీమ్‌ దేవ్‌దే. ఒకర్ని ఎన్నుకుని, మిగతావారిని ఆకూవక్కతో పంపించేవారు. తర్వాత రహస్యంగా మంతనాలు జరిగేవి. అలా వచ్చిందే సుపారీ అనే మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement