
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో హంతకుల ఊహాచిత్రాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విడుదల చేసింది. సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన ఇంటి ముందు లంకేశ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆమె హత్య జరిగిన 5 వారాల అనంతరం ఘటనకు కారణమని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మూడు ఊహా చిత్రాలను 21 మంది సభ్యుల సిట్ బృందం మీడియాకు విడుదల చేసింది.
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరు నిపుణులైన చిత్రకారులు ఈ చిత్రాల్ని గీశారని, అందులో రెండు చిత్రాలు ఒక వ్యక్తివేనని సిట్ చీఫ్ బీ.కే సింగ్ బెంగళూరులో వెల్లడించారు. ఈ కేసులో దాదాపు 200–250 మందిని విచారించామని, హంతకులు దేశీ తయారీ 7.65 ఎం.ఎం తుపాకీ వాడారని తెలిపారు. ‘లంకేశ్ హత్యకు వృత్తిపరమైన విభేదాలు కారణం కాదని ఇంతకుముందే చెప్పాం. ఈ ఘటనలో ఏ జర్నలిస్టు ప్రమేయం లేదు. అయితే అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. సదరు నిందితులిద్దర్నీ ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా భావిస్తున్నామని, 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చని, కనీసం ఏడు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందన్నారు.
ఆ హత్యలతో సారూప్యత లేదు
మహారాష్ట్రలోని దబోల్కర్, పన్సారే, కర్ణాటకలోని కల్బుర్గీ హత్యలకు సారూప్యత ఉన్నట్లు చెప్పలేమని సింగ్ పేర్కొన్నారు. సిట్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఘటనకు సంబంధమున్న రెండు వీడియోలను సిట్ మీడియాకు అందజేసింది. ఆమె ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌నూ సిట్ విడుదల చేసింది.