ముంబైలో మరో ‘నిర్భయ’ | Mumbai Woman molestation and assaulted in Saki Naka, dies in hospital | Sakshi
Sakshi News home page

ముంబైలో మరో ‘నిర్భయ’

Sep 12 2021 3:54 AM | Updated on Sep 12 2021 4:16 AM

Mumbai Woman molestation and assaulted in Saki Naka, dies in hospital - Sakshi

సాక్షి, ముంబై: దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా పునరావృతమయ్యింది. నగర శివారు సాకినాక ప్రాంతంలో ఖైరానీ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున టెంపో వాహనంలో 34 ఏళ్ల మహిళపై దుండగుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూసింది.

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ ఘటనలో జరిగినట్లుగానే ముంబైలో బాధితురాలి మర్మాయవాల్లోకి దుండగుడు ఇనుప రాడ్‌ దూర్చి రాక్షసంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికితోటు కత్తిపోట్ల వల్ల తీవ్ర రక్తస్రావమై బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. ఖైరానీ రోడ్డుపై వాహనంలో మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసిన సమీపంలోని ఓ కంపెనీ వాచ్‌మన్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి, సమాచారం ఇవ్వడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, బాధిత మహిళను అదే టెంపో వాహనంలో ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు.

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మోహన్‌ చౌహాన్‌(45)గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిందితుడు దర్యాప్తులో తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి ముంబై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాని్న(సిట్‌) ఏర్పాటు చేశారు. మహిళపై అత్యాచారం చేసి, దారుణంగా హింసించి చంపడం మానవత్వానికే మాయని మచ్చ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే అన్నారు. ఈ సంఘటనపై వేగంగా దర్యాప్తు జరిపిస్తామని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వారిద్దరూ కలిసి ఉంటున్నారా?
ఇదిలా ఉండగా, బాధితురాలి తల్లితో ఫోన్‌లో మాట్లాడామని ముంబై మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ చెప్పారు. తన కుమార్తె(బాధితురాలు) పట్టుబడిన నిందితుడితో గత 10–12 ఏళ్లుగా కలిసి ఉంటోందని, ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని చెప్పిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా గొడవ పడడంతో తీవ్రంగా కొట్టి ఉండవచ్చని భావిస్తున్నట్లు తల్లి తమ దృష్టికి తీసుకొచి్చందని అన్నారు. సాకినాకలో అత్యాచారం ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ డిమాండ్‌ చేశారు. ముంబైలో తమకు భద్రత లేదన్న భావన మహిళల్లో కలుగుతోందని చెప్పారు.  

మత్తుకు బానిసగా మారి అకృత్యం
మహిళపై అత్యాచారం, హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొంది. అత్యాచారం ఘటనలో మోహన్‌ చౌహాన్‌తోపాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళలకు పెళ్లయ్యింది. 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది. సాకినాక ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన నిందితుడు మోహన్‌ చౌహాన్‌ ముంబైలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాత్రిపూట సాకినాకలో పుట్‌పాత్‌లపై నిద్రిస్తుంటాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. మహిళపై అత్యాచారం చేసిన సమయంలో అతడు మత్తులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మోహన్‌ చౌహాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతడిని ఈ నెల 21 దాకా రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement