కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఈ కమ్రంలో సంజయ రాయ్ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిందితుడి తరఫున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. అనంతరం వాదనలు వినిపించాల్సిందిగా సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. ‘నిందితుడు నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? న్యాయవాది కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం. ఇలా చేయటం చాలా దురదృష్టకరం’’ అని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ తిరస్కరించింది.
ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment