ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీ హత్యకు సింబంధిచి.. నిందితుల బుల్లెట్ల నిల్వ, యూట్యూబ్ ద్వారా గన్ షూటింగ్ శిక్షణ, ఘననాస్థలం నుంచి వెంటనే తప్పించుకునే ప్రణాళిక వివరాలను పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. హర్యానా చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) షూటర్లు. హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్ (23), పూణేకు చెందిన రవీణ్ లోంకర్ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్ధిఖీని హత్యకు చేసేందుకు నిందితులు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ తమ తుపాకుల్లో 65 బుల్లెట్లు అమర్చారు. ముందుగానే భారీగా బుల్లెట్లు నిల్వ ఉంచుకున్నారు. నిందితులు ఉపయోగించిన రెండు తుపాకీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి ఆస్ట్రియాలో తయారు కాగా, మరొకటి స్థానికంగా తయారు చేయబడింది. ఈ ఆయుధాలతో పాటు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు వారి వద్ద 28 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
టర్కీలో తయారు చేసిన 7.62 బోర్ పిస్టల్, 30 రౌండ్‌లకు సరిపడే బుల్లెట్లు కలిగివున్న నల్లటి బ్యాగ్‌ను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాగ్‌లో రెండు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఒకటి కేసులో అనుమానితుడైన శివకుమార్ గౌతమ్ పేరుతో ఉంది. మరొకటి సుమిత్ కుమార్ పేరుతో ఉంది. కానీ, రెండు కార్డులలో శివకుమార్ ఫోటో ఉండటం గమనార్హం.
సెకండ్ హ్యాండ్ బైక్ కొని..
నిందితులు ముందుగా మోటర్‌బైక్‌పై నుంచి కాల్పులు జరపాలని ప్లాన్ వేశారు. షూటర్లు లొకేషన్ వరకు ప్రయాణించి కాల్పులు జరిపి.. ఆపై బైక్‌పై త్వరగా పారిపోవాలని అనుకున్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రణాళికను పక్కకుపెట్టారు. అయితే.. ముగ్గురు నిందితులు హత్య జరిగిన ప్రదేశానికి ఆటో రిక్షాలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. హత్య తర్వాత వారిని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు బట్టలు మార్చుకున్నారు. నిందితుడు హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్ మోటార్ బైక్ కొనుగోలుకు మిగతా నిందితులకు రూ. 60 వేలు పంపిచాడు. రూ.32 వేలతో సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారు.
ప్రధాన నిందితుడు, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శుభమ్ లోంకర్‌తో పాటు పలువురు అనుమానితుల ప్రమేయం పోలీసుల విచారణలో వెల్లడైంది. నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్న లోంకర్‌పై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. లోంకర్ హత్యకు మూడు రోజుల ముందు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ అక్టోబర్ 9న తన ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు. అతని సోదరుడు ప్రవీణ్ లోంకర్ నిందితులకు ఆర్థిక సహాయం అందించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
యూట్యూబ్ వీడియోలతో ప్రాక్టీస్
షూటర్లు యూట్యూబ్ వీడియోలు చూసి తుపాకీలను ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. హత్యకు ముందు నిందితులు ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారు ఆయుధాలను లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం, హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ చేశారు. ఖాళీ స్థలం లేకపోవడంతో బుల్లెట్లు లేకుండా షూటింగ్ ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’
Comments
Please login to add a commentAdd a comment