సాక్షి ప్రతినిధి కడప : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ‘చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసుల యాక్షన్’లా కొనసాగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల చుట్టూనే తప్ప హత్య వెనుకగల కుట్రకోణం దిశగా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. మరోవైపు.. సీఎం చంద్రబాబు నిత్యం వైఎస్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నారు. హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా కేసు వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు.. సరికదా నిందితులెవరన్నది వెల్లడికాలేదు. హత్య జరిగిన తీరు పరిశీలిస్తే కిరాయి హంతకులు చేసిన పనేనని స్పష్టమవుతున్నా అందుకు సూత్రధారులు, పాత్రధారులు ఎవ్వరన్న విషయం తెలియలేదు.
వైఎస్ కుటుంబంపైనే దుష్ప్రచారం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారాన్ని ఆ కుటుంబానికి ఆపాదిస్తూ నిందలు వేయడంపైనే టీడీపీలో సీఎం చంద్రబాబు నుంచి మిగిలిన నేతలందరూ దృష్టిపెట్టారు. నలభైఏళ్లు డాక్టర్‌గా అనుభవం ఉన్న ఈసీ గంగిరెడ్డి.. వివేకానందరెడ్డి పడిపోయిన తీరు పరిశీలించగానే హత్యగా ఎందుకు నిర్ధారించలేదని ఆరోపిస్తున్నారు. అదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రనాథరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వాస్తవంగా హత్య చోటుచేసుకున్న రోజు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సాయంత్రం 3.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. అయినా, టీడీపీ నేతలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయా నేతల ఆరోపణలకు అనుగుణంగానే పోలీసుల బృందం విచారణ జరుపుతోంది.
ఇప్పటికే వైఎస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు పలుమార్లు విచారించారు. కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయి ఆ కుటుంబం దుఃఖసాగరంలో ఉంటే వారినే పోలీసులు పదేపదే విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా వివేకా గుండెపోటుకు గురై చనిపోయినట్లుగా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడించారు. వాస్తవ విరుద్ధమైన ప్రకటనను ఎస్పీ చేయడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి పులివెందుల సీఐ శంకరయ్య వచ్చాకే ఆయన సమక్షంలో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే, సీఎంఓ ఆదేశాల మేరకే పోలీసు యంత్రాంగం యాక్షన్ చేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమంటూ లీకులిస్తున్నారు.
జగన్‌ను నియంత్రించేందుకు వివేకా హత్య
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న కుట్ర కోణం దిశగా పోలీసుల విచారణ సాగడంలేదు. ఈనెల 16న ఇడుపులపాయ కేంద్రంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార వ్యవహారాల్లో వైఎస్ జగన్‌ను నియంత్రించేందుకు చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని టార్గెట్ చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. మరోవైపు.. జమ్మలమడుగులో ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన పీ రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఏకమయ్యారు. తాము ఇరువురం ఏకమైతే టీడీపీదే మెజార్టీ అంటూ వ్యాఖ్యానించారు. కానీ, అక్కడ ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన ఏడు పంచాయితీలల్లో ఏకపక్ష పోలింగ్ ఉండేది. ప్రస్తుతం ఐదు పంచాయితీల్లోని వివిధ గ్రామాల నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దేవగుడి, దానవులపాడు మినహా పంచాయితీలన్నీ ఏకపక్ష పోలింగ్‌కు బ్రేక్ పడనుంది. మరోవైపు.. పులివెందులలో వైఎస్సార్‌సీపీ మెజార్టీని కట్టడి చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో భయోత్పాతం సృష్టించేందుకు వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్య చేయించారా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర కోణం దిశగా పోలీసుల విచారణ సాగడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఒత్తిళ్లే ప్రధానమని తెలుస్తోంది.
పరమేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక టీడీపీ?
ఇదిలా ఉంటే.. వివేకానందరెడ్డి తనకు మంచి స్నేహితుడని.. ఆయన్ను చంపాల్సిన అవసరం తనకు లేదని సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వరరెడ్డి తిరుపతి ఆస్పత్రిలో మీడియాకు చెప్పారు. అంతేకాక, ఆయన హత్య ‘ఇంటి దొంగల పనే’ అని మరో మాట అన్నారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న తరహాలో పరమేశ్వరరెడ్డి ఆరోపించడంపై పలు అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. పరమేశ్వరరెడ్డి టీడీపీలో చేరేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్యవర్తిత్వం చేశారని.. అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రనాథరెడ్డి తెలిపారు. టీడీపీలోకి వెళ్తున్న పరమేశ్వరరెడ్డి వెళ్తూ వెళ్తూ వైఎస్ కుటుంబంపై నిందలు వేస్తున్నారా.. లేక వ్యూహాత్మకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment