సాక్షి ప్రతినిధి కడప/సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం విచారణ సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్‌కు తగ్గట్లుగానే కొనసాగుతోంది. హత్య వెనుక దాగిన అసలు కుట్రకోణం జోలికి పోకుండా విచారణ అంతా వైఎస్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల చుట్టూ తిరుగుతోంది. హత్యకు గురైన వివేకాతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిపైనే దృష్టి సారించారు. ఓ స్థల వివాదాన్ని అసలు సమస్యగా తెరపైకి తెస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివేకా హత్యోదంతాన్ని పక్కదారి పట్టించేందుకుగాను చంద్రబాబు మొదలుకుని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పథకం ప్రకారం వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే.
(హత్య చేయించి.. అసత్యాలు వల్లించి..)
వివేకాని వారి కుటుంబీకులే హత్య చేశారని, రక్తనమూనాలు చెరిపేయడమే ఇందుకు నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా నిజమని నమ్మించేందుకు గాను గోబెల్స్ తరహాలో ఈ విష ప్రచారానికి టీడీపీ దిగిందని వారు చెబుతున్నారు. వివేకాని హత్య చేస్తే ఎవరికి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? ఆయన్ను అడ్డు తొలగించాల్సిన అవసరం ఎవరికుంది? తదితర అనేక కోణాలను వదిలి ఆర్థిక సంబంధాలు, కుటుంబ వివాదాలు అంటూ అనుకూల మీడియాకు పథకం ప్రకారం లీకులివ్వడం, సిట్ దర్యాప్తు సైతం అదే రీతిలో కొనసాగుతుండటం గమనార్హం. సిట్ అధికారులకు శనివారం ఉదయం నుంచి సీఎంవో, పోలీసు ప్రధాన కార్యాలయం, ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న ఫోన్లు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం.
ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ..
వివేకా హత్యలో అసలు రాజకీయ కోణాన్ని పక్కనబెట్టి, బెంగళూరులో ఓ స్థలం వివాదాన్ని తెరపైకి తెచ్చి, ఆ కోణంలోనే విచారణ చేపడుతున్నట్టు సమాచారం. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ నేతృత్వంలోని సిట్ వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలాన్ని శనివారం సందర్శించింది. బాత్‌రూంను పరిశీలించింది. ఇప్పటికీ రక్తపు మరకలు బాత్‌రూంలో ఉన్నాయి. వివేకా సన్నిహితుడైన తొండూరు మండల నేత ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్, వంటమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు అశోక్, వాచ్‌మెన్ రంగన్న తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తున్నారు.
కుట్రకోణం జోలికి పోని వైనం..
వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లాకు వివేకానందరెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉండే వివేకాకి జిల్లావ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజకర్గంపైన మంచి అవగాహన, పరిచయాలున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందడంతో జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలను కూడా వివేకానందరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఒక్కటై పనిచేస్తున్నప్పటికీ వైఎస్సార్‌సీపీకి బలమైన సమీకరణలు చేయడంలో వివేకా ఇటీవల గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా అంతటా వైఎస్సార్‌సీపీకి అనుకూల పరిస్థితి ఉండటంతోపాటు జమ్మలమడుగులోనూ టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో వివేకానందరెడ్డిని టార్గెట్ చేసారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అజాతశత్రువుగా పేరొందిన వివేకానందరెడ్డిని హత్య చేయడం ద్వారా రాయలసీమలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ఎత్తుగడ ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరగాల్సి ఉంది. ఈ హత్యతో ఫ్యాక్షన్ ముద్రవేసి రాయలసీమలో అలజడులు రేపి ఎన్నికలు వాయిదా వేయించేలా రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ఇటువంటి కీలకమైన కుట్రకోణాలను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని సిట్ అధికారులు విస్మరించి దర్యాప్తును కుటుంబసభ్యులు, సన్నిహితుల వైపుగా కొనసాగించడం వెనుక ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నట్టు సందేహాలకు తావిస్తోంది.
పక్కదారి పట్టించేందుకే తెరపైకి లేఖ
‘నా డ్రైవర్‌ను నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లేఖ రాసేందుకు చాలా కష్టపడుతున్నాను. డ్రైవర్ ప్రసాద్‌ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దు’ అని రక్తపు మరకలతో లేఖ తెరపైకి వచ్చింది. ఘటన తర్వాతే వివేకా రాసిపెట్టినట్లు భావించాల్సి వస్తే.. లేఖ ఎందుకు రాస్తారు? సన్నిహితులకు ఫోన్ చేయడం లేదా బయట ఉన్న వాచ్‌మెన్‌ను నిద్ర లేపడమో చేస్తారు కదా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. హత్య ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకే వ్యూహాత్మకంగా లెటర్ తెరపైకి తెచ్చారని పలువురు భావిస్తున్నారు.
అసలు విషయం వదిలేసి దుష్ప్రచారమా...
వివేకా హత్యపై పథకం ప్రకారమే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. శుక్రవారం వివేకా ఇంటి వద్ద జరిగిన పరిణామాలకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలను వారు ఉదహరిస్తూ.. వాటిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ప్రతిరోజులాగానే శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వివేకా ఇంటికి వచ్చారు. ఆ సమయానికి నిద్రలేచే అలవాటున్న వివేకానందరెడ్డి లేవకపోవడంతో రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చారని వాచ్‌మెన్ ద్వారా తెలుసుకున్నారు. ఇంకా సార్ నిద్ర లేవలేదంటూ వివేకా కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా కృష్ణారెడ్డి తెలిపారు. ఆలస్యంగా వచ్చుంటారు.. నిద్రపోనివ్వండి అంటూ అక్కడినుంచి జవాబు రావడంతో న్యూస్ పేపర్లు చదువుతూ ఉండిపోయారు.
ఆరు గంటల ప్రాంతంలో వంటమనిషి లక్ష్మి తన కుమారుడు అశోక్‌తో కలసి వచ్చింది. సార్ ఇంత సమయం వరకు ఎప్పుడూ నిద్రపోరు.. అంటూ లక్ష్మి తలుపులు తడుతూ పిలవడం ఆరంభించింది. పీఏ కృష్ణారెడ్డి సైతం పిలవడం ఆరంభించారు. ఈలోపు గార్డెన్ వైపు వెళ్లిన వాచ్‌మెన్ రంగన్న అటు వైపు ఉన్న తలుపు తెరిచి ఉండటాన్ని గమనించి, వెంటనే అక్కడి వారికి చెప్పారు. తెరిచిన తలుపు గుండా పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు అశోక్ 6.15 గంటల ప్రాంతంలో లోపలికెళ్లారు. బెడ్‌మీద వైఎస్ వివేకా లేకపోవడం, మంచం పక్కనే రక్తం పెద్దగా పడి ఉండడం, బాత్‌రూం తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న వివేకాను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే నాడి పరిశీలించి, చనిపోయారని భావించిన కృష్ణారెడ్డి.. వివేకా కుమార్తె, అల్లుడుకి ఫోన్ చేశారు. వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డి తన సోదరుడు శివప్రకాష్‌రెడ్డికి విషయాన్ని తెలిపారు.
(‘పోలీసులు ఏం చేయాలో కూడా చంద్రబాబు చెబుతున్నారు’)
శివప్రకాష్‌రెడ్డి మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఫోన్ చేసి, వివేకానందరెడ్డి చనిపోయారని తెలిపారు. ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోపు 6.30 గంటల ప్రాంతంలో అవినాష్‌రెడ్డి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఏమి జరిగిందని ఇంట్లో వారిని విచారించి 6.43 గంటలకు పులివెందుల పోలీసులకు ఫోన్ చేశారు. తర్వాత 7.00 గంటలకు, 7.07, 7.09 గంటలకు వరుసగా ఫోన్లు చేశారు. 7.13 గంటలకు అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్య తన సెల్‌లో ఫొటోలు, వీడియో తీశారు. తర్వాత ఆస్పత్రి సిబ్బంది వచ్చారు. రక్తంతో ఉన్న ముఖం అలాగే కన్పిస్తే చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని సీఐ సమక్షంలోనే ముఖంపై ఉన్న రక్తాన్ని గుడ్డతో తుడిచారు. తలపై లోతైన గాయాలుండటంతో వెంటనే ఆస్పత్రికి దేహాన్ని తరలించారు.
ఇదంతా 7.45 గంటల వరకు సాగింది. బాత్‌రూంలో నమూనాల కోసం ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు తాళం తెప్పించి లాక్ చేశారు. తాళం చెవి వారి అధీనంలో ఉంచుకున్నారు. బెడ్ పక్కన రక్తాన్ని మాత్రమే సీఐ సమక్షంలో శుభ్రం చేశారు. 8 గంటలకు పీఏ కృష్ణారెడ్డి తాను ఏదైతే చూశారో, అదే విషయాన్ని రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకా మృతి అనుమానాస్పదంగా ఉందని, విచారణ చేపట్టాలని కోరారు. టీడీపీ తప్పుడు ప్రచారం అందుకుంది. గుండెపోటు అన్నారు, అంతలోనే హత్య అన్నారు, రక్త నమూనాలు చెరిపేశారని దుష్ప్రచారం మొదలు పెట్టిందని పరిశీలకులు అంటున్నారు.
(చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న)
Comments
Please login to add a commentAdd a comment