ఇంతకాలం మాట్లాడనందుకు సిగ్గుగా ఉంది  | Actor Prakash Raj comments about Gowri Lankesh | Sakshi
Sakshi News home page

ఇంతకాలం మాట్లాడనందుకు సిగ్గుగా ఉంది 

Published Wed, Nov 29 2017 4:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:35 PM

Actor Prakash Raj comments about Gowri Lankesh - Sakshi

లామకాన్‌లో కొలిమి రవ్వలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గీతా రామస్వామి, వసంతలక్ష్మి, సుశీతారూ, చందన్‌ గౌడ, కవితా లంకేశ్, ప్రకాశ్‌ రాజ్, కృష్ణవంశీ

సాక్షి, హైదరాబాద్‌: ‘అంబేడ్కర్‌ చెప్పిన సామాజిక న్యాయం గురించి ఆమె మాట్లాడింది. భావప్రకటనా స్వేచ్ఛ కోసం ఆమె పోరాడింది. తాను జీవించి ఉండటం కోసం కూడా తాను మాట్లాడింది. రాసింది. ఆమె, నేను కలసి పెరిగాం. గౌరీగా ఎదుగుతున్నప్పుడు కంటే మరణం తరువాతే మేం ఆమె నుంచి నేర్చుకుంటున్నాం’అని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. గౌరీ లంకేశ్‌ రచనల సంకలనం తెలుగు అనువాదం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని తనని అంతా ప్రశ్నిస్తున్నారని, నిజానికి ఇంతకాలం మాట్లాడనందుకు తాను సిగ్గుపడుతున్నానని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. గొంతు లేని వారికి తాను బలమైన గొంతుకైనం దుకు గౌరీ హత్య జరిగిందన్నారు. అయితే ఇదే మొదటిది కూడా కాదని గోవింద్‌ పన్సారే, కల్‌బుర్గి, దబోల్కర్‌ల వరుసలో గౌరీ లంకేశ్‌ కూడా హత్యకు గురైందన్నారు. ఇదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నా పదేళ్ల కూతురు సైతం నా క్షేమం గురించి భయపడింది. నా తల్లి దేవుడి ముందు మోకరిల్లింది.. నాకేమీ కాకూడదని.. ఇలా ఎందుకు జరుగుతోంది. ఎందుకీ హత్యలు.. నిశ్శబ్దాన్ని వీడి ప్రశ్నించాలని ప్రకాశ్‌ రాజ్‌ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు.  

నిశ్శబ్దం సమాజానికి పట్టిన పెద్ద జబ్బు 
నిశ్శబ్దం ఈ సమాజానికి పట్టిన పెద్దజబ్బు అని.. దాన్ని వదలించుకుని ప్రతిఒక్కరూ మార్పుకి నాంది పలకాలని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. గొంతులు పెగల్చుకుని అణగారిన వర్గాల, అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన మాట్లాడాలని అన్నారు. ‘కొన్ని గొంతులను మూయించి వాళ్లన్నీ సాధించామనుకొంటే పొరపాటు, భిన్నాభిప్రాయాలుంటే చర్చించాలి. కానీ చంపడాన్ని సహించకూడదు. ఇక మాట్లాడాల్సిన సందర్భమిదే. గౌరీ ఒంటరిగా పోరాడింది. ఇప్పుడందరం ఎవరికి వారుగా, కలసికట్టుగా, ఎక్కడైనా, సందర్భమేదైనా మాట్లాడాలి’ అని ప్రకాశ్‌ రాజ్‌ గద్గద స్వరంతో అన్నారు. 

‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ 
నగరంలోని లామకాన్‌లో గౌరీ లంకేశ్‌ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని గౌరీ సోదరి కవితా లంకేశ్, ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్, సంపాదకుడు చందన్‌ గౌడ, ప్రొఫెసర్‌ సుశీతారూ, సీనియర్‌ పాత్రికేయురాలు వసంతలక్ష్మి ఆవిష్కరించారు. చందన్‌గౌడ సంపాదకత్వంలో వచ్చిన గౌరీ లంకేశ్‌ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్‌ మాట్లాడుతూ గౌరీ లంకేశ్‌ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ సత్యాన్ని మరుగుపర్చడం కోసం ముసుగు హత్యలు జరుగుతుంటే మౌనంగా ఉండటం సమాజానికి చేటు చేస్తుందన్నారు. మతం అనేది జీవన విధానమని, హింస మతం లక్షణం కాదని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్‌ చందన్‌ గౌడ మాట్లాడుతూ భయంలేని సమాజం కోసం గౌరీ లంకేశ్‌ తుది శ్వాస వరకు పోరాడారని అన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, కృష్ణవంశీ మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement