న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతోపాటు తీవ్ర విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు.
సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక, సంస్థాగత సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడూ చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే ప్రధాని మోదీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.
ఆర్థిక, సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులం అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేలి్చచెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వ హయాంలో ఎక్స్–రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment