చంపినా చావని ప్రశ్న..! | Samanya Kiran Writes on Gowri Lankesh | Sakshi
Sakshi News home page

చంపినా చావని ప్రశ్న..!

Published Tue, Sep 19 2017 9:06 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

చంపినా చావని ప్రశ్న..!

చంపినా చావని ప్రశ్న..!

ఆలోచనం
నాకు నచ్చిన విధంగా నేను పాడుతానన్న బసవన్న లాగే గౌరీ లంకేశ్‌ కూడా ‘‘నా మనసు ఏది చెప్తే అదే మాట్లాడుతాను’’ అన్నారు. గౌరీని హత్య చేయడమంటే ప్రశ్నని అంతమొందించడానికి ప్రయత్నించడమే.

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కన్నడ రచయిత పి.లంకేశ్‌ బండల సందుల్లోంచి చెట్లు మొలిచినట్టు ‘రాళ్ళూ... కరిగే వేళ’వస్తుందని, మనుష్యుల మధ్య కుల అంతరాలు తొలిగిపోతాయని విశ్వసించాడు. ఆ లక్ష్యంతో తన పేరుతోనే లంకేశ్‌ అనే పత్రిక కూడా పెట్టారు. తండ్రి ఇచ్చిన అభ్యుదయ వారసత్వాన్ని ‘గౌరీ లంకేశ్‌ పత్రిక’గా కొనసాగించారు గౌరీ లంకేశ్‌. గత వారం ఆమె హత్యకి గురి అయ్యారు. ధబోల్కర్, కల్బుర్గి వంటి హేతువాదుల హత్యలను ఈ సంఘటన గుర్తు చేసింది. కల్బుర్గి, లంకేశ్‌లు  ఇద్దరూ లింగాయత్‌ కులం వారే. వర్ణ, కుల లింగ వివక్షకు వ్యతిరేకంగా బసవన్న పన్నెండవ శతాబ్దంలో ఒక మహోద్యమం చేశారు. సాంఘిక సమానత్వం ఈ ఉద్యమ లక్ష్యం. ‘కాయ కావే కైలాస’ (కాయకష్టం తోటే కైలాసం) ఈ ఉద్యమ నినాదం. ఈ ఉద్యమ వారసులే లింగాయత్‌లు.

కల్బుర్గి బసవుడి ఉద్యమం ఫలితంగా వచ్చిన ‘వచన’ అనే గొప్ప సాహిత్య సంప్రదాయం మీద విస్తృత పరిశోధన చేశారు. వచనాలని కెంపుల కాంతులుగా పేర్కొన్నారు  కల్బుర్గి. ఆయన వచన సాహిత్యం వేదాలు, బైబిల్, ఖురాన్‌ అంత పవిత్రమైనవని భావిం చారు. కల్బుర్గి పరిశోధనలు ఇచ్చిన చైతన్యం లింగాయత్‌ని ప్రత్యేక మతంగా గుర్తించాలనే ఉద్యమానికి దోహదం చేసింది. ఈ ప్రత్యేక మత సూత్రీకరణ హిందుత్వ వాదులకు కోపం తెప్పించింది. కల్బుర్గి తన పరిశోధనతో బసవేశ్వరుని చెల్లి నాగాలాంబికకు, చెప్పులు కుట్టే కులంవాడైన దోహర కక్కయ్య కవికి పుట్టిన సంతానమే చెన్నబసవేశ్వరుడు అని తెలుసుకొన్నారు.

ఈ విషయాన్నీ ప్రకటించడం వలన బసవుడి స్ఫూర్తిని వదిలేసి ‘మఠాలుగా’ అవతరించిన లింగాయత్‌ మత పెద్దల ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలితంగా కల్బుర్గి అనేక బెదిరింపులని ఎదుర్కొన్నారు. ఆయనికి పోలీస్‌ రక్షణ కల్పించాల్సి వచ్చింది. కల్బుర్గి తాను ఎంతో ప్రేమించిన వచనాలలో చెప్పినట్టు ‘‘పిడుగులతో పోరాడగల యోధులకు గొడుగులు ఎందుకు’’ అనుకున్నాడో ఏమో గానీ కొన్ని రోజుల తర్వాత రక్షణ వద్దన్నాడు. హత్యకు గురయ్యాడు.  

నాకు నచ్చిన విధంగా నేను పాడుతాను అన్నాడు బసవన్న. గౌరీ లంకేశ్‌ కూడా ‘‘నా మనసు ఏది చెప్తే అదే మాట్లాడతాను’’ అని భావించారు. ఆమె బసవుడి వచనంలో ‘‘సిరియాళుడిని వ్యాపారి అని నేనెలా చెప్తాను, మచ్చయ్యని చాకలి అని, కక్కయ్యని చెప్పులు కుట్టేవాడని, నన్ను నేను బ్రాహ్మణుడినని ఎలా చెప్పుకుంటాను? అలా చెప్తే కూడల సంగమయ్య నవ్వడా’’ అని అన్నట్టు కుల వ్యవస్థని తిరస్కరించే దృక్పథాన్ని ఆలోచనల్లో, రాతల్లో చూపించారు.

పెరుమాళ్‌ మురుగన్‌ నవల ‘‘వన్‌ పార్ట్‌ వుమన్‌’’పై ఛాందసవాదులు దాడులు చేసినపుడు, ఎస్‌.ఎల్‌ భైరప్ప నవల ‘పర్వ’ని  పోలిక తెచ్చి, ఈ రెండు నవలల్లోనూ సంతానహీనులైన స్త్రీలు ఇతర పురుషుల నుంచి వీర్య దానాన్ని స్వీకరించారు కదా, మరి మీరు భైరప్పని ఏమీ అనకుండా, మురుగన్‌పై ఎందుకు దాడి చేస్తున్నారు? భైరప్ప బ్రాహ్మణుడు, మురుగన్‌ తక్కువ కులం వాడనా? అంటూ ప్రశ్నించారు.. గౌరీని హత్య చేయడమంటే కల్బుర్గిని హత్య చేయటం లాగే ప్రశ్నని అంతమొందించడానికి ప్రయత్నించడమే అని చాలా మంది మేధావుల అభిప్రాయం. ‘‘వారు మమ్మల్ని పాతి పెట్టాలనుకొన్నారు, కానీ వారికి మేము విత్తనాలం అని తెలి యదు’’ అంటుందో మెక్సికన్‌ సామెత. అలాగే ఎంత మందిని చంపినా కొత్త ప్రశ్నలు తిరిగి తిరిగి మొలుస్తూనే ఉంటాయి కదా.

తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన మొదటి కోకిల పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి వీర శైవాన్ని నచ్చాడు, స్వీకరించాడు. బసవన్న గురించి విన్నాడు. బసవన్న ప్రభావంలో పడ్డాడు. తలమునకలుగా భక్తిలో ఓలలాడాడు. ద్విపదలో భక్తుల కథలతో ఏడు ఆశ్వాసాల బసవ పురాణం రచించాడు. అయితే పాల్కురికి మత ఆవేశం అవధుల్లేని ఉద్రేకం. అతను ‘‘జన సమయ మతస్తుల శిరముల దునిమి, మును విష్ణు సమయుల ముక్కులు గోసి యద్వైతులను హతహతముగా ద్రోలి’’... ఎంత హింసయినా సరే చేసి శివభక్తిని ప్రచారం చేయాలి అన్నాడు.

కానీ ఆనాడు ఉవ్వెత్తున లేచిన వీర శైవంలోని ఉద్రేకం, ఉద్వేగం కాలగర్భంలో కలిసిపోయాయి. పాల్కురికి జైనుల శిరములు దునుమాలని కోరుకున్నాడు గాని ఈ రోజు భారతదేశంలో శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం సహజీవనం చేస్తున్నాయి. ఎంతో కొంత వీర శైవం లక్షణాలు ఉన్న బీజేపీకి నేడు ఒక జైనుడు జాతీయ అధ్యక్షుడు. ఈ విషయాలు అటుంచుతే ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి పూర్తిగా మోదీ వ్యక్తిత్వమే కారణం. ఈ గెలుపు మోదీ గెలుపు మాత్రమే. మోదీ ఒక చాయ్‌వాలా, ఒక బీసీ. అభివృద్ధి కాముకుడు. ఇవి ఓటర్లను అమితంగా ఆకర్షించాయి. అలాంటప్పుడు ఈ మత అసహిష్ణుతను ఆయన ఎందుకని తన ఖాతాలోకి తీసుకోవాలి? ఇప్పుడు నా చింత ఇది కాదు... ‘‘మోదీ చాయ్‌ వాలా అమ్మా, భేటీ బచావ్‌ – భేటీ పడావ్‌ అన్నాడమ్మా’’ అని ప్రేమగా చెప్పుకునే నా కూతురికి గౌరీ హత్య గురించి అడిగితే ఏమని చెప్పాలి?.

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
సామాన్య కిరణ్‌
91635 69966

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement