
సాక్షి, బెంగళూర్ : జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను కాల్చిచంపినట్టు అనుమానిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. గౌరీ లంకేష్ హత్య జరిగిన రోజే రాడికల్ రైట్ వింగ్ గ్రూప్‌నకు చెందిన కోవర్టు బృందం అధిపతి ఒకరు తనకు 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీని ఇచ్చాడని విచారణాధికారులకు నిందితుడు తెలిపాడు. సెప్టెంబర్ 5, 2017న గౌరీ లంకేష్‌ను కాల్చిచంపిన కేసులో అరెస్ట్ అయిన పరుశురామ్ అలియాస్ వగ్మారె, పరశు అలియాస్ కోహ్లీ కర్ణాటక సిట్ అధికారులకు ఈ మేరకు వెల్లడించాడు. హత్య జరిగిన రోజే తనకు ఆయుధాన్ని సమకూర్చారని, అంతకుముందు రోజు హత్యకు ప్రణాళిక రూపొందించగా ఆమె అనుకున్న సమయం కంటే ముందుగానే ఇంటికి చేరుకోవడంతో మరుసటి రోజు ఆపరేషన్ చేపట్టామని తెలిపినట్టు సిట్ వర్గాలు పేర్కొన్నాయి.
గౌరీ లంకేష్ హత్యకు సహ కుట్రదారుగా వ్యవహరించాలని విజయపుర జిల్లా సింధగికి చెందిన 26 ఏళ్ల వగ్మారెను రంగంలోకి దింపారని హత్య జరిగిన రోజే అతడికి గన్ ఇచ్చారని సిట్ వగ్మారె రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది. కాగా గౌరీ లంకేష్ హత్య జరిగిన వెంటనే గన్‌తో పాటు మిగిలిన బుల్లెట్లను ప్రధాన కుట్రదారులకు అప్పగించానని వగ్మారె విచారణ సందర్భంగా పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.
వగ్మరే అరెస్ట్ అనంతరం అనుమానిత షూటర్‌కు శ్రీరామ సేనతో సంబంధాలున్నాయని, హత్యకు వాడిన ఆయుధం సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5న హిందూ జనజాగృతి సమితి మాజీ కన్వీనర్ అమోల్ కాల్వే షూటర్‌కు అందించినట్టు సిట్ విచారణ నిగ్గుతేల్చింది. కాగా గౌరీ లంకేష్ హత్య జరిగిన ఘటనా స్థలంలో లభ్యమైన బుల్లెట్లు, క్యాట్రిడ్జ్‌లను పరిశీలించిన ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం హత్యకు ఉపయోగించిన 7.65 ఎంఎం పిస్టల్‌నేధార్వాడ్‌లో 2015, ఆగస్ట్ 30న జరిగిన కన్నడ మేథావి ఎంఎం కల్బుర్గి హత్యలో , అదే ఏడాది ఫిబ్రవరి 16న కొల్హాపూర్‌లో జరిగిన వామపక్ష మేథావి గోవింద్ పన్సారేల హత్యలో వాడినట్టు తేలడం గమనార్హం. కాగా, పన్సారే హత్యకు ఉపయోగించిన రెండో గన్ పూణేలో ఆగస్ట్ 20, 2013లో హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్యలోనూ వాడినట్టు వెల్లడైంది.