సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట జరిగిన పెద్ద నోట్లరద్దు అంశం శాసనసభలో కాసేపు వేడి పుట్టించింది. నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య జనం, వ్యాపారులు, రైతులపై పడిన ప్రభావంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచా రి తిరస్కరించారు. దీనిపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేయడం, అందుకు బీజేపీ అభ్యంతరం తెలపడం, మధ్యలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడం.. సభలో కొద్దిసేపు దుమారం రేపింది. ప్రశ్నోత్తరాలు, విద్యుత్‌పై సీఎం చేసిన ప్రకటన అనంతరం కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వెంటనే ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ, వాయిదా తీర్మానం తిరస్కరించినందున నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీ శ్ రావు జోక్యం చేసుకొని, తిరస్కరణ తర్వాత అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రరారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు నిరసనకు అవకాశం ఇవ్వవద్దం టూ స్పీకర్‌ను కోరారు. గందరగోళం మధ్యే కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. ‘నోట్ల రద్దుతో సామాన్య ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక దీనిపై సభలో చర్చించాలి’ అని అనడంతో మళ్లీ బీజేపీ సభ్యులు అభ్యంతరం పెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు.
ఆర్థిక పరిస్థితిపై చర్చిద్దాం: కేసీఆర్
సీఎం మాట్లాడుతూ, ‘ఈ విషయంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు, ప్రజలపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభా వం ఒక్కో రీతిగా ఉంది. దీనిపై బీఏసీలో చర్చించాలని జానారెడ్డి కోరారు. చర్చ పెట్టా లని మేము కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంపై చర్చిద్దాం. దీనిపై జానారెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించినందున నిరసన తెలుపుతా మంటున్నారు, తెలపనివ్వండి’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఉత్తమ్‌కు అవకాశం ఇచ్చారు.
‘ప్రధాని నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, తీవ్ర నష్టం జరిగింది. నోట్ల రద్దు ప్రభావం, తుగ్లక్ నిర్ణయంపై సభలో తీర్మానం చేద్దాం’ అంటూ ఉత్తమ్ కొనసాగిస్తుండగానే మైక్ కట్ చేశారు. నిరసన తెలపాలనుకుంటే అది చెప్పాలి కానీ, ఉపోద్ఘాతం ఎందుకంటూ సీఎం చురకలు అంటించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, ‘నోట్ల రద్దు’ ప్రభావంపై చర్చించాలంటూ మండలిలో కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించవద్దని చెప్పి చైర్మన్ స్వామిగౌడ్ సభను నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
‘నోట్ల రద్దు’ నిరసనపై వాడీవేడి చర్చ
Published Thu, Nov 9 2017 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment