ఎస్.రాజమహేంద్రారెడ్డి:
ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో!
ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది?
నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో!
బీజం పడిందక్కడే...!
రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం.
ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్‌లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!?
Comments
Please login to add a commentAdd a comment