
నోట్లరద్దు: మళ్లీ జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం!
న్యూఢిల్లీ: గత నవంబర్ 8న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కొత్త సంవత్సరానికి ముందే డిసెంబర్ 31 (శనివారం) ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకు నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే.
పెద్దనోట్ల రద్దుతో దేశంలో చలామణిలో ఉన్న 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు, నిరుపేదలు నానా కష్టాలు పడ్డారు. బ్యాంకుల, ఏటీఎంలు పొడువైన క్యూలతో పోటెత్తాయి. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని ప్రధాని మోదీ చెప్తున్నారు.