రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్లాక్‌ను వైట్ చేసుకొనేందుకు బడాబాబులు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. బంగారు, భూముల కొనుగోళ్లపై భారీగా నగదును వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. సగటున ఉమ్మడి జిల్లాలో సాగే బంగారు వ్యాపారాలకంటే ప్రస్తుతం 20 శాతం అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. సరైన ప్రూఫ్స్ ఉంటే అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈదిశగా కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పుడు ఎటూ చూసినా రెండువేల నోట్లపై చర్చ జరుగుతోంది.
పలమనేరు: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా రెండువేల నోట్లను సెప్ట్టెంబర్ 30లోపు మార్చుకోవాలనే నిబంధనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బడాబాబులు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. డీమోనటరైజేషన్ తర్వాత రెండువేల నోట్లు కనిపించకుండా పోయాయి. సాధారణ లావాదేవీల్లో, బ్యాంకు ఏటీఎంలలోనూ వీటీ ఊసేలేకుండా పోయింది. దీంతో సామాన్యులకు ఈ నోటుతో పనిలేకుండా పోయింది. ప్రస్తుతం రెండువేల నోట్ల మార్చుకునే విషయంపై సామాన్యజనం అసలు పట్టించుకోవడం లేదు. రెండువేల నోట్లను రోజుకు రూ.20 వేల వరకు బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. మే 23 నుంచి సెప్టంబరు 30 దాకా సాధారణ సెలవులు, బ్యాంకు సెలవులు పోగా కేవలం వందరోజుల మాత్రమే పనిచేస్తాయి.
రోజుకు రూ.20 వేలు మార్చుకుంటే వందరోజులకు రూ.20 లక్షలను మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. దీంతో బడా బాబులు భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఎకరా సెటిల్‌మెంట్ పొలం వ్యాల్యుయేషన్ రూ.20 లక్షలుగా ఉండగా దానికి ప్రభుత్వ విలువ రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఈ భూములను కొన్న వారు ప్రభుత్వ మార్కెట్ విలువ మేరకు స్టాంపు డ్యూటీ చెల్లించి ఆ మొత్తాన్ని మాత్రం వైట్ కరెన్సీ ఇచ్చి మిగిలిన పైకాన్ని బ్లాక్‌లో ఇవ్వడం ఇప్పుడు రెండువేల నోట్ల మార్పిడిలో సాగతున్న మరో తంతు. ఇవికాక పెట్రోలు బంకులు, మద్యం దుకాణాలు, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్ వ్యాపారాల్లో పేఆన్ డెలవరీలాంటి ద్వారా నోట్ల మార్పిడి సాగుతోంది.
20శాతం పెరిగిన బంగారు అమ్మకాలు
బడాబాబులు బంగారాన్ని కొనుగోలు చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఆభరణాలను కొంటే మేకింగ్ చార్జీ, తరుగు, జీఎస్టీ మూడుశాతం లాంటివి ఉంటుండడంతో కేవలం బిస్కెట్లు, కాయిన్స్‌గా కొంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు దుకాణ నిర్వాహకులు గ్రాముపై అధిక ధర ఇస్తేనే రెండు వేలనోట్లను తీసుకుంటామంటూ షరతులు పెడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా సాగే వ్యాపారాలకంటే ప్రస్తుతం 20 శాతం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం.
భారీగా బ్యాంకు డిపాజిట్లు
రోజుకి రూ.20వేలు మాత్రమే రెండువేల నోట్లను మార్చుకోవాల్సి ఉంది. కానీ డిపాజిట్లకు మాత్రం నిబంధనలు లేవు. దీంతో పలు బ్యాంకులు ఇలాంటి వారి ద్వారా భారీగా డిపాజిట్లను సేకరిస్తున్నాయి. మరికొందరు తమ బంధువులు బ్యాంకులో పెట్టిన బంగారాన్ని రూ.2వేల నోట్లతో విడిపించి, మళ్లీ మరో బ్యాంకులో వాటిని తనఖా పెట్టి వైట్ కరెన్సీని అధికారికంగా పొందుతున్నారు.
నోట్లను మార్చేందుకు కమీషన్ ఏజెంట్లు
రోజూ బ్యాంకుల్లో డబ్బులు మార్చేందుకు కమీషన్ ఏజెంట్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు డబ్బున్న ఆసాముల నుంచి రెండువేల కరెన్సీ పొంది తమ మనుషుల ద్వారా బ్యాంకులోవారి ఖాతోల్లోకి జమచేస్తున్నారు. తద్వారా వీరికి రూ.20 వేలకు రూ.500 కమీషన్‌గా పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment