ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ బాగా పుంజుకుంది. కీలక వడ్డీరేట్టు తగ్గనున్నాయనే అంచనాలతో 36పైసలు పైకి ఎగబాకింది. డాలర్ మారకపువిలువలో రూపాయి రూ. 68 స్థాయి నుంచి పుంజుకుంది. బుధవారం ఆరంభంలో 12 పైసల లాభంతో రూ. 67.78 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 8 పైసల లాభంతో రూ. 67.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం తర్వాత అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ కు బాగా డిమాండ్ పుట్టింది. దీంతో ప్రపంచ కరెన్సీలు పతనమయ్యాయి. దీంతో రూపాయి కూడా రూ.68 దిగువకు పతనమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ తర్వాత మొదటి సారి ఆర్ బీఐ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రెండురోజులు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) సమీక్ష విధానాన్ని ప్రకటించనున్నారు. 0.25 -0.50 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆరేళ్ల కనిష్టానికి కీలక వడ్డీరేట్లు చేరనున్నాయని భావిస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి బలహీనపడ్డాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా ధరలకు బూస్ట్‌నివ్వాలని భావించినప్పటికీ ట్రేడర్లు చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తుండటంతో చమురు ధరలు క్షీణిస్తున్నాయి. ఏఏ దేశాలు ఎంతమేర ఉత్పత్తిలో కోత పెట్టేదీ స్పష్టతలేదని, ఒప్పందానికి ఎన్ని దేశాలు కట్టుబడేదీ కూడా అనుమానమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు స్వదేశీ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు కూడా బలహీనంగానే కదులుతున్నాయి.
రూపాయికి పాలసీ రివ్యూ జోష్!
Published Wed, Dec 7 2016 10:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement
Advertisement