బనశంకరి: ఆసరాగా ఉంటాయనుకున్న పెద్ద నోట్లు ఇప్పుడు పెనుభారమయ్యాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్‌లో ఆ నోట్ల చెలామణి పెరిగింది. నగల షాపులు, పెట్రోల్ బంకులు, హోటల్, షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కడచూసినా 2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఆ నోట్లను స్వీకరిస్తుండగా, మరికొందరు తిరస్కరిస్తుండడం గమనార్హం. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను ఖాతాదారులు తమ అకౌంట్లలోకి రోజుకు రూ.20 వేల వరకు జమ చేయవచ్చు. నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కానీ ప్రజల్లో అనేక అపోహలు ఏర్పడడంతో త్వరగా ఆ నోట్లను వదిలించుకోవడానికి ఆత్రుత పడుతున్నారు.
పలు రకాలుగా మార్పిడి
ధనవంతులు, వ్యాపారస్తులు తమ వద్ద పోగుపడిన 2 వేల నోట్ల మార్పిడికి రకరకాల ఉపాయాలు అనుసరిస్తున్నారు. తమ సిబ్బంది, ఇతరుల చేత మార్పిడి చేయడం, బ్యాంకుల్లో డిపాజిట్లు చేయిస్తున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యులు, ఉద్యోగులు, స్నేహితులు ద్వారా రహస్యంగా ఈ పనిలో నిమగ్నమయ్యారు.
ఆదాయపన్ను శాఖ భయం
ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులకు సమాధానం ఇవ్వాలనే కారణంతో కొన్ని చోట్ల రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు తటపటాయిస్తున్నారు. మొబైల్స్, కిరాణా, దినసరి వస్తువుల చిల్లర షాపుల్లో వ్యాపారులు రూ.2 వేల నోట్లను తీసుకోవడం లేదు. అప్పు కావాలంటే ఇస్తాం, ఈ నోట్లు వద్దు అంటున్నారు.
ఖరీదైన వస్తువుల కొనుగోలు
అవసరం లేకపోయినా వివాహాది శుభకార్యాల పేరుతో పెద్ద మొత్తాల్లో బంగారం కొనుగోలు చేసి 2 వేల నోట్లు ఇచ్చేస్తున్నారు. బంగారు దుకాణాల్లో పెద్ద నోట్ల ఎక్కువగా చెలామణి చేస్తున్నారు. పెట్రోల్‌బంక్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, విలువైన వస్తువులను కూడా 2 వేల నోట్ల కట్టలతో కొనేస్తున్నారు. కొన్ని చోట్ల బంగారు షాపుల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవాలంటే తులం బంగారంపై రూ.5 వేలు, 10 వేలు రేటు పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నోట్లు మేం మార్చుకోవాలంటే చాలా కష్టం, కాబట్టి ఇంతేనని షాపుల సిబ్బంది చెప్పడంతో గత్యంతరం లేక సరే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment