లండన్‌లో మాట్లాడుతున్న రాహుల్
లండన్/బెర్లిన్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను పోల్చారు. లండన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు.
ఆరెస్సెస్ భారత స్వాభావికతను మార్చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలను తన చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. ‘భారత స్వాభావికతను మార్చాలని ఆరెస్సెస్ చూస్తోంది. ఏ ఇతర పార్టీలు భారత చట్టబద్ధ సంస్థలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోలేదు. అరబ్ ప్రపంచంలోని ముస్లిం బ్రదర్‌హుడ్ ఆలోచన లాగే ఆరెస్సెస్ ఉద్దేశ్యాలున్నాయి’ అని అన్నారు. మోదీ సర్కారు నిర్ణయాలనూ విమర్శించారు.
సంఘ్ నిర్ణయాన్ని మోదీ అమలుచేశారు
ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపైనా రాహుల్ విమర్శలు చేశారు. ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆరెస్సెస్ వ్యూహమే. ప్రధాని ఆలోచనల్లో రద్దు నిర్ణయాన్ని చొప్పించారు. ఆర్థిక మంత్రి, ఆర్బీఐ ద్వారా అమల్లో పెట్టారు. నోట్లరద్దు ద్వారా చిన్న, మధ్యతరగతి వ్యాపారసంస్థలు భారీగా నష్టపోయాయి’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే చైనాతో డోక్లాం వివాదం తలెత్తి ఉండేదే కాదన్నారు.
‘డోక్లాం ఓ ప్రత్యేక వివాదం కాదు. కొన్ని వరుసఘటనల పరిణామం’ అని అన్నారు. పాకిస్తాన్ విషయంలో మోదీకి ఓ స్పష్టమైన విధానమంటూ ఏదీ లేదన్నారు. పాక్‌తో చర్చలు అంత సులభం కాదన్నారు. అంతకుముందు యూకే విపక్షమైన లేబర్ పార్టీ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. బ్రిటన్ వీసా విధానంలో మార్పుల కారణంగా యూకేలో భారతీయ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తెచ్చారు.
విద్వేషాన్ని చిమ్ముతున్నాయి
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ, ఆరెస్సెస్‌లు విద్వేషాన్ని చిమ్ముతూ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని బెర్లిన్‌లో (భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి) భారత సంతతి ప్రజలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో రాహుల్ విమర్శించారు. గురునానక్ బోధనల సారమైన భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని కాంగ్రెస్ తూచ తప్పకుండా పాటిస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగడం, యువతకు సరైన ఉపాధికల్పన లేకపోవడం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ అందరిది. ప్రతి ఒక్కరికోసం పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని విస్తృతం చేస్తుంది. కానీ నేటి కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది’ అని రాహుల్ విమర్శించారు. కాగా, గురునానక్ బోధనలే తనకు స్ఫూర్తి అన్న రాహుల్ వెంటనే 1984 సిక్కు అల్లర్లకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2004 నుంచి పదేళ్లపాటు అధికారంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీలో కాస్త అహంకారం వచ్చిందని రాహుల్ అంగీకరించారు. దీని ఫలితంగానే 2014లో పార్టీ ఓడిందన్నారు. 2019లో బీజేపీ వ్యతిరేక కూటమి విజయం సాధిస్తుందన్నారు.
ముస్లిం బ్రదర్‌హుడ్ నేపథ్యమిదీ..
అరబ్ దేశాల్లో అస్తిత్వంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ వివిధ దేశాల్లో సున్నీ ముస్లింలతో ఏర్పాటైన బృందం. 1928లో ఈజిప్టులో ఉపాధ్యాయుడైన హసన్ అల్ బన్నా ఈ సంస్థను ప్రారంభించారు. అరబ్ దేశాల్లో ఈ సంస్థకు ఎక్కువ మద్దతుదారులున్నారు. హమాస్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులకూ ముస్లిం బ్రదర్‌హుడ్ అండదండలున్నాయి. ఇస్లామిక్ సేవాకార్యక్రమాలతోపాటు రాజకీయాల్లో కీలకంగా ఉండడం ఈ సంస్థ లక్ష్యం. ‘ప్రపంచానికి ఇస్లామే పరిష్కారం’ వీరి నినాదం. జోర్డాన్, హమాస్, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ పేరుతో రాజకీయ పార్టీని పెట్టింది.
ఈజిప్టులో ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. సౌదీ అరేబియా ఆరంభంలో ఈ సంస్థకు అండగా నిలిచింది. ప్రస్తుతం కఠినంగా వ్యవహరిస్తోంది. 2011లో హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా ఈజిప్టులో విప్లవం (జాస్మిన్ విప్లవం అని పేరు) ముస్లిం బ్రదర్‌హుడ్ నేతృత్వంలో జరిగింది. 2012లో ఈజిప్టులో మహ్మద్ మోర్సీ నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆరంభంలో ఈ సంస్థకు అనుకూలంగా ఉన్నా .. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం కారణంగా తర్వాత ఆంక్షలు విధించింది.
2015లో బహ్రెయిన్, ఈజిప్టు, రష్యా, సిరియా, సౌదీ, యూఏఈలు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతానికి ఖతార్, టర్కీలు ఈ సంస్థకు అండగా ఉన్నాయి. ‘ఇస్లామిక్ సంస్కరణలు తీసుకుకొచ్చేందుకు రాజకీయ సంస్కరణలు ముఖ్యమని మేం భావిస్తాం. రాజకీయ బహుళత్వం, ప్రజాస్వామ్యం, అధికార మార్పిడిపై విశ్వాసముంది. ఇస్లామిక్ సంస్కరణలంటే ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం, రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసుకునే హక్కునివ్వడం మొదలైనవి’ అని ఈ సంస్థ తన వెబ్‌సైట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment