నోట్ల రద్దుపై మీరు నేరుగా మోదీకే చెప్పండి!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ తాను తీసుకున్న నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో తెలుపండి అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. తన యాప్‌లోకి లాగిన్ అయ్యి.. తమ అభిప్రాయాలు తెలుపాలని ప్రజలకు సూచించారు. ‘కరెన్సీ నోట్ల విషయమై మీ సొంత అభిప్రాయాలను నేను తెలుసుకోదలిచాను. ఎన్‌ఎం యాప్ (http://nm4.in/dnldapp)లో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనండి’ అని అన్నారు.
ఈ నెల 8న రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి కొత్త నోట్లను తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తగినంత నగదు అందుబాటులోలేక, బ్యాంకుల ముందు పడిగాపులు పడలేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు 50రోజులపాటు ఈ తాత్కాలిక కష్టాలను ప్రజలు భరిస్తే.. నల్లధనాన్ని వెలికితీసి దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తానని ప్రధాని మోదీ అంటున్నారు.