ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు చర్యలు తీసుకున్నాం
జీఎఫ్‌ఎఫ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీల్లో తగు మార్పులు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం, దేశీయంగా పరిశోధనలు.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్లు కేటాయించడం, వ్యక్తిగత డేటా భద్రత చట్టం రూపకల్పన వంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
అంకుర సంస్థలను దెబ్బతీసే సైబర్ మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలకు సూచించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్) 2024లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు.
ఆర్థిక సేవలను అందరికీ అందుబాటలోకి తేవడంలో ఫిన్‌టెక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గడిచిన పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరిగిందని, దీనికి నగదు బదిలీ పథకంలాంటివి నిదర్శనమని వివరించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ త్రయంతో నగదు లావాదేవీలు తగ్గాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగభాగం భారత్‌లోనే ఉంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, పండుగల వేళ దేశ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్లలో వేడుకల వాతావరణం నెలకొందని చెప్పారు. అధునాతన టెక్నాలజీలు, నిబంధనలతో ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, సమర్ధమంతమైన భారీ యంత్రాంగాలను రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు.
గూగుల్ పేలో యూపీఐ సర్కిల్..
జీఎఫ్‌ఎఫ్ సందర్భంగా గూగుల్ పే యూపీఐ సర్కిల్‌ను ఆవిష్కరించింది. బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఈ–రూపీ (యూపీఐ వోచర్లు), రూపే కార్డులకు సంబంధించి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూపీఐ లైట్‌లో ఆటోపే ఆప్షన్‌ను కూడా గూగుల్ పే ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment