న్యూఢిల్లీ: మణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనం దాల్చడమేంటని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్ గురించి ప్రధాని మోదీ నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే ముందుగా చేయాల్సింది ఆ రాష్ట్ర సీఎంను తొలగించడమేనన్నారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్ని కప్పిపుచ్చు కోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పలు ట్వీట్లు చేశారు. ‘గడిచిన 55 రోజుల్లో మణిపూర్ గురించి ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏం చెబుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
మోదీ జీ నిజంగా మణిపూర్‌లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడి బీజేపీ సీఎంను ముందుగా తొలగించండి’అని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాద సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో సంభాషణలు జరిపి, ఉమ్మడి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వానికి ఖర్గే సూచించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించాలి. ప్రజలకు నిత్యావవసర వస్తువులను అందుబాటులోకి తేవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి’అని ఖర్గే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment