
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు.
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్ నేత ఎస్‌ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్‌లే కారణమంటూ బీఆర్ అంబేడ్కర్ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎస్‌సీ,ఎస్‌టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు.