హోదాపై నేను అలా అనలేదు..
వేడిగా ఉన్నప్పుడే చట్టంలో చేర్చాలన్నాను: వెంకయ్యనాయుడు వివరణ
సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదా విషయంలో తాను మాట్లాడిన మాటకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. ఈనెల 17న విజయవాడలో ప్రత్యేక ప్యాకేజీ అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ‘ఆ వేడిలో హోదా అన్నా..’ అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’ అదే శీర్షికన ప్రచురించింది. అయితే విశాఖలో సీ ఫుడ్ ఇండియా ఇంటర్నేషనల్ షో సందర్భంగా శుక్రవారం వెంకయ్య మాట్లాడారు. ఆంగ్లంలో ప్రసంగిస్తున్న మంత్రి మధ్యలో తెలుగులోకి వచ్చారు. ‘వేడిలో హోదా అన్నానంటూ.. ఓ పత్రికలో రాశారు. వేడిలో నేనెందుకంటాను. వేడిగా ఉన్నప్పుడే దానిని (హోదాను) చట్టంలో చేర్చి ఉంటే సరిపోయేదన్నాను.
ఆ రోజు పార్లమెంటులో తలుపులు మూశారు. దూరదర్శన్ ప్రసారాలు నిలిపేశారు. మైకులు ఆపేశారు. అన్నీ బంద్ చేశారు. ఆ సమయంలో నా వాయిస్ వినిపించాను. ఏపీ ప్రజల తరఫున ఆ రోజు నేను పార్లమెంటులో లేవనెత్తకపోతే ఎవరూ మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు. ఏపీ భవిష్యత్ అంధకార బంధురం అయి ఉండేది. ప్రజలు నేతలకంటే తెలివైనవారు. అన్నీ తెలుసుకుంటారు. నేనేమీ ఆందోళన చెందను..’ అంటూ ఆ అంశాన్ని ముగించారు.