‘చంద్రబాబు పీఆర్వోగా వెంకయ్య’
అమరావతి : వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి స్థాయి నుంచి దిగజారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి పీఆర్వోగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు రామకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకయ్యనాయుడు ఏం సాధించారని ప్రత్యేక విమానాల్లో వచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో పదేళ్లు హోదా ఇప్పిస్తానని సన్మానాలు చేయించుకున్న వెంకయ్య ప్రస్తుతం ప్యాకేజీ పేరుతో రెండో కృష్ణుడి అవతారం ఎత్తి సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు.
విభజన బిల్లులో న్యాయం జరగలేదని, మేము న్యాయం చేస్తామని చెబుతూ సన్మానాలు చేయించుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పది శాతం మంది కూడా ప్యాకేజీకి ఆమోదం తెలపడం లేదని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి 2020 వరకు మాత్రమే పన్ను రాయితీలు ప్రకటించడంతో పెద్దగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్యాకేజీపై రిఫరెండంగా మళ్లీ పోటీ చేయాలని రామకృష్ణ సవాల్ చేశారు.