విద్యుత్ కేంద్రంగా సింహపురి
♦ కేంద్రం సహకారంతో విద్యుత్ కొరతను అధిగమించాం
♦ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
♦ నెల్లూరు జిల్లాలో ఏపీ జెన్‌కో పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(టౌన్) /ముత్తుకూరు: భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ‘పవర్’ బ్యాంక్ అయితే.. రాష్ట్రానికి నెల్లూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో రూ.12,300 కోట్లతో 1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రాన్ని ఆయన శనివారం కేంద్ర మంత్రులతో కలసి జాతికి అంకితం చేశారు. రెండోదశలో రూ.4,276 కోట్ల అంచనాతో నిర్మించనున్న 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ జెన్‌కో పరిపాలనా భవానాన్ని ప్రారంభించారు.
నేలటూరులో బహిరంగ సభ, గాయత్రి పవర్ ప్లాంట్‌లో పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం సహకారంతో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను అధిగమించామని చెప్పారు. ప్రతి ఇంటికీ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సౌర, పవన విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒక్కపైసా కూడా అవినీతి జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు.
‘పవర్’ ఫుల్‌గా ఆంధ్రప్రదేశ్
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ‘పవర్’ ఫుల్‌గా అవతరించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏర్పడనుందన్నారు. 2022 నాటికి దేశంలో ఇళ్లులేని వారు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు నెలలో అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులశాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ , ప్రకాశ్ జవదేకర్, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు.
సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ ప్రారంభం
పరిశ్రమల ఏర్పాటు ద్వారా సింగపూర్‌కు చెందిన ‘సెంబ్‌కార్ప్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో విస్తరించిందని ఆ సంస్థ చైర్మన్ ఆంగ్ కాంగ్ హువా తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో 2,640 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ‘సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్’ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. సెంబ్‌కార్ప్ సీఈఓ టాంగ్ కిన్‌ఫె మాట్లాడుతూ... భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో తమ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. గాయత్రి సంస్థ ఎండీ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ... సెంబ్‌కార్ప్ సంస్థతో తాము సంయుక్తంగా రూ.20,000 కోట్లతో నేలటూరులో 2,640 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు నిర్మించామన్నారు.