కేంద్ర నుంచి వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలయమ్యారని సీపీఐ.....
రాయలసీమ సమగ్రాభివృద్ధి బస్సుయాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
మద్దికెర: కేంద్ర నుంచి వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలయమ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబుల కొండారెడ్డి విమర్శించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఉభయ కమ్యూనిస్టులు చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మద్దికెరకు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయాంచాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మేల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు మా ఎమ్మెల్యేలను కొంటున్నాడని ఆరోపించిన చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మాని ఏపీని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు రామచంద్రయ్య, భీమలింగప్ప, నబిరసూల్, షడ్రక్, ప్రభాకర్‌రెడ్డి,రామాంజనేయులు, సీపీఐ మండల కార్యదర్శి హనుమప్ప తదితరులు పాల్గొన్నారు.