బంద్ సంపూర్ణం | Complete bandh | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Wed, Aug 12 2015 3:22 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

బంద్ సంపూర్ణం - Sakshi

బంద్ సంపూర్ణం

 అనంతపురం అర్బన్ :  ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఐఎంల్(న్యూడెమోక్రసీ) బంద్‌లో కలిసి వచ్చాయి. న్యాయవాదుల సంఘం, జర్నలిస్టుల సంఘం, ఎస్సీ, ఎస్టీ సేన, విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య, ఏపీ రైతు సంఘాలు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి.  బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.   సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబుళు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ద్రోహులంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్క్‌లు వేసుకుని సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో కార్యకర్తలు సప్తగిరి సర్కిల్‌లో అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలియజేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టవర్ క్లాక్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు.

సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ ) జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, నాయకులు బంద్‌కి మద్దతు ఇచ్చి విధులు బహిష్కరించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు.

ఐఎంఎం అధ్యక్షుడు మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బంద్‌కి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు కొర్రపాడు హుసేన్ పీరా, రాజారెడ్డి, పెన్నోబుళేసు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ సేన రాష్ట అధ్యక్షులు బీకేఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నగరంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

 చెదురుమదురు సంఘటనలు
 చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లా అంతటా ప్రశాంతంగా జరిగింది. తిలక్ రోడ్డులో దివాకర్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు అద్దాన్ని ఆందోళనకారులు పగలగొట్టారు.   టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు, ప్రాంతాల్లో ఆటోలను నిలువరించారు.  

 కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూత
 బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తపోవనం వద్ద హైవే దిగ్బంధం నిర్వహించారు. అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయాలను మూయించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయిన కార్యకర్తలు  చైర్మన్ చమన్‌ను చాంబర్ నుంచి బయటికి పంపించివేశారు.  అనంతరం సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకుని అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.  

 వివధ ప్రాంతాల్లో...
 ఉరవకొండలో కవితా హోటల్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. బస్సులు నిలిపివేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం కేంద్రంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. నేసేపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో నిరసనలు తెలియజేశారు.  గుంతకల్లు పట్టణంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. శ్రీరాములు సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

హిందూపురంలో అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. కదిరిలో బంద్ సందర్భంగా అంద్కేర్ సర్కిల్‌లో అఖిలపక్ష పార్టీ నాయకులు  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టి బొమ్మని దహనం చేశారు. కళ్యాణదుర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది.  మడకశిర, పెనుకొండ, రాయదుర్గం,   శింగనమల నియోజకవర్గ కేంద్రాల్లోనూ బంద్ ప్రశాంతంగా జరిగింది.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టిన నేతలు
 ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని పార్టీల నేతల ఎండగట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించుకునే వరకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ ముందుకు మోకరిల్లిందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని దుమ్మెత్తి పోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement