
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
* రాజ్యసభ ఎంపీల లాటరీపై ఓ అవగాహనకు..
* ఆ గ్రామాలను తెలంగాణలో ఉంచాలనడం సబబే
* పలు సమస్యలపై వెంకయ్యతో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపుపై అటార్నీ జనరల్‌కు నివేదించనున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని న్యాయ శాఖకు తెలియజేస్తారని, దాని ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై తదుపరి నిర్ణయముంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్ గురువారమిక్కడ వెంకయ్యతో సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచుకోడానికి విభజన చట్టంలో వీలున్నప్పటికీ స్పష్టత లేదు. పాత జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఎంత వరకు చట్టబద్ధత ఉంటుందనే దానిపై చర్చించాం. అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రానికి అభ్యంతరం లేదు. ఇతర రాష్ట్రాలు ప్రశ్నించకుండా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం’ అని వెంకయ్య చెప్పారు.
విభజన సమయంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులను ఏపీకి, ఏపీకి చెందిన వారిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించడం వల్ల వచ్చిన సమస్యపై ఓ అవగాహనకు వచ్చినట్లు వెంకయ్య తెలిపారు. రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలతో మాట్లాడి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశాలను వివరిస్తానన్నారు. అలాగే పోలవరం ముంపు దృష్ట్యా ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరడం సహేతుకంగానే అనిపిస్తోందని వెంకయ్య చెప్పారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారానికి వస్తే న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు.
తెలుగుభాషను పరిరక్షించుకోవాలి
మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌ను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు భాష తెరమరుగవడానికి చేస్తున్న చర్యలు సరికాదన్నారు. 17న సంక్రాంతి సంబరాల విందు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, లహరి, నజీర్‌జాన్, రామ్ గణేష్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.